అరవై ఏళ్ళు దోచుకున్న రాబందు ప్రభుత్వం కావాలా, రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న రైతు బంధు ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించాలి అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ కెటి. రామారావు పిలుపునిచ్చారు.
బషీర్ బాగ్, ముదిగొండలో కాల్పులు జరిపిన చరిత్ర ప్రతిపక్షాలదయితే, రైతు బంధు పథకం అమలుచేసి రైతులను ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కాంగ్రెస్ ను కూకటివేళ్ళతో పెకిలించివేయడానికి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని, కాంగ్రెస్ లో కలిపేసారని ఆయన ఎద్దేవా చేసారు. విద్యుత్ కోతలతో ఆనాడు ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రతిపక్షాలు ఒక వైపు, అసలు కరెంటు కోతే లేకుండా 24 గంటలు ఇస్తున్న రైతు ప్రభుత్వం మరోవైపు వున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 65 ఏండ్ల పరిపాలనలో సరయిన తాగునీరు ఇవ్వకుండా నల్లగొండ ప్రజలను ఇక్కట్లకు గురిచేసిన ప్రతిపక్షాలు ఒకవైపు వుంటే, కేవలం నాలుగేండ్లలో ఇంటింటికీ సురక్షిత మంచి నీరు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం ఇంకోవైపు ఉందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలయికతో ఎంతో జుగుప్సాకర రాజకీయాలకు తెర తీసారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు తాము సిద్ధమే అంటూ బయటకు మాత్రం డాంభికాలు ప్రదర్శిస్తూ, ఎన్నికల సంఘం సమావేశంలో మాత్రం ఎన్నికలకు అంత తొందరేముందని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వీళ్ళకు ప్రజలు తగురీతిలో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.