రైతుల రుణమాఫీపై ఆర్‌బీఐ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. ఇప్పటికే రైతుల రుణమాఫీ అంశంపై ఆర్‌బీఐ గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. రుణమాఫీతో పాటు రుణాల రీ షెడ్యూల్ విషయంపై కూడా సరైన నిర్ణయం తీసుకుంటూ రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకుపోతున్నది.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఇచ్చిన పంట రుణాలకు మాత్రమే రీషెడ్యూల్ అవకాశం ఉంటుంది. దీనిద్వారా దాదాపు 12% వడ్డీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పంట రుణాలే కాకుండా ఇతర రుణాల విషయంలోనూ రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే రుణమాఫీకి చర్యలు తీసుకుంటోంది.
ఇదిలాఉండగా, తెలంగాణకు అదనపు విద్యుత్ కోరుతూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి గురువారం తెలంగాణ రాష్ట్ర సర్కార్ లేఖ రాయగా అందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సూచనమేరకు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చంద్ర ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందం ఖరారైంది. ఇందుకు అవసరమైన పవర్ లైన్స్ ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది.