mt_logo

రుణమాఫీకి జీవో

-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల
-మాఫీకానున్న మొత్తం రుణం 17
-36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు
-బ్యాంకులకు నేరుగా చెల్లించనున్న ప్రభుత్వం
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటన
-నేడు బ్యాంకర్లతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ..
-తదుపరి విడత రుణమాఫీపై చర్చ
-అమల్లోకి వస్తున్న టీఆర్‌ఎస్ కీలక ఎన్నికల హామీ
-ప్రభుత్వ నిర్ణయంపై రైతుల హర్షాతిరేకాలు
-మాది రైతు సంక్షేమ ప్రభుత్వం: పోచారం
-రైతులకోసం ఎంత భారమైనా భరిస్తాం: ఈటెల
-పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరణలో నిరూపించుకున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు రుణాలు మాఫీచేసే ప్రక్రియ ఆచరణ రూపుదాల్చింది. రాష్ట్రంలో 36 లక్షలమంది రైతులకు చెందిన రూ.17వేల కోట్ల పంట రుణాలను మాఫీచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో తొలి విడతగా 25శాతం అంటే.. రూ.4250 కోట్లను వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సోమవారమే జీవో విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్థికశాఖ కార్యదర్శి కే రామకృష్ణారావు జీవో ఆర్‌టీ నంబర్ 532 విడుదల చేశారు.

జీవో మేరకు తొలి విడతలో విడుదలైన రూ.4250 కోట్లు రుణమాఫీకి అర్హులైన అందరు రైతులకు వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించడంవల్ల రైతుల రుణాలు రీషెడ్యూల్ కావడమే కాకుండా, వారికి పంటల బీమా కూడా వర్తిస్తుంది. రుణమాఫీపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలతో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రికి అందజేసింది. ఈ నివేదికలోని అంశాల ప్రకారం రుణమాఫీ అమలును వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని సీఎం వారికి చెప్పారు.

మొదటి విడత చెల్లించే మొత్తానికి జీవో జారీ చేయాలని ఆర్థికశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు ఈ నెలాఖరులోగా వాటిని చెల్లించకుంటే వారిపై వడ్డీ భారం పడే అవకాశం ఉంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం దానిని నివారించేందుకు సెప్టెంబర్ 30లోపే మొదటి విడత నగదును బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.

రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి పోచారం
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, రైతులు కంట నీరు పెట్టకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీపై ఉపసంఘం నివేదికను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీని అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

ఎన్నికల ముందు కేసీఆర్ రైతులకు రుణమాఫీపై హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తే, జూన్ 4వ తేదీనే బ్యాంకర్లతో సమావేశమై రుణమాఫీపై చర్చించారని పోచారం తెలిపారు. 36 లక్షలమంది రైతులకు రూ.17వేల కోట్లను మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఉపసంఘం నివేదికకు ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపారని చెప్పారు. రైతుల పక్షాన సీఎంకు వ్యవసాయ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల బ్యాంకులు కూడా వెంటనే రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇస్తాయని, రైతులకు పంటల బీమా కూడా వర్తిస్తుందని వెల్లడించారు.

బ్యాంకులు రైతులకు ఖరీఫ్ రుణాలు ఇవ్వడానికి సెప్టెంబర్ 30 గడువు తేదీ అని, ఆలోపు రుణాలు చెల్లించకపోతే రైతులపై అధిక వడ్డీ భారం పడడమే కాకుండా, సకాలంలో రుణాలు చెల్లించనివారి జాబితాలోకి రైతులు చేరే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా భారమైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీని అమలుచేస్తున్నామని చెప్పారు. రైతుల రుణాలపై 7% వడ్డీ ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం 4%, రాష్ట్ర ప్రభుత్వం 3% భరిస్తాయని వెల్లడించారు.

మాది చేతల ప్రభుత్వం: ఈటెల రాజేందర్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదని, అందుకే రైతులు కంటనీరు పెట్టకుండా, వారికి ఇచ్చిన మాటను అమలుచేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకముందే కొందరు రాజకీయ పార్టీల నాయకులు రైతుల రుణమాఫీపై రకరకాలైన విమర్శలు చేశారు. ఎలా అమలు చేస్తారు? నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అమలు చేసి చూపిస్తాం అని ఈటెల అన్నారు.

సెప్టెంబర్ 30లోపు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే రైతుల ఖాతాలు బ్యాడ్ ఎకౌంట్‌లో పడే అవకాశం ఉన్నందున, రైతుల కష్టాలను అర్థంచేసుకొని ప్రభుత్వమే బ్యాంకులకు పూచీకత్తు ఇస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని అసెంబ్లీలో అడిగితే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. కేవలం రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాంబర్ ముందు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయిస్తే బూటు కాలుతో తన్నుకుంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి వెళ్లిపోయారే కానీ, తెలంగాణ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని మాత్రం ఇవ్వలేదు. అలాంటి పార్టీకి చెందిన నాయకులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదు అని రాజేందర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు అయిన రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ రూ.480కోట్లను కూడా చెల్లించామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల వాగ్దానాలు, మాటలు ఓట్లకోసం, సీట్లకోసమేకానీ రైతుల సంక్షేమంకోసం కాదని విమర్శించారు. తెలంగాణలో దసరా పండుగ నుంచి రూ.1000 పెన్షన్, వికలాంకులకు రూ.1500 పెన్షన్‌ను కూడా అమలుచేసి తీరుతామని పునరుద్ఘాటించారు. తెలంగాణ రైతులు రుణమాఫీపై సందేహాలను వీడి, రైతులకోసం వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరిచిపోవద్దని ఈటెల కోరారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మొదటి విడత నగదు చెల్లింపు లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

మొత్తం రుణాలు రూ.17 వేల కోట్లలో ప్రభుత్వం చెల్లించే 25% రుణాలు అంటే, అందులోని 25 శాతం మంది రైతులకే మొదట రుణాల చెల్లింపు కాదని చెప్పారు. లక్ష రూపాయలు తీసుకున్న వారికి రూ.25 వేలు, నలబైవేలు తీసుకున్న వారికి రూ.10 వేలు, 20 వేలు తీసుకున్న వారికి రూ.5వేలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులతో బ్యాంకులు రైతులు తీసుకున్న రుణంలోంచి కొంత మొత్తమైనా తిరిగి పొందడంతో వారికి రుణాలను రీషెడ్యూల్ చేయడమే కాకుండా, పంటల బీమాను కూడా వర్తింపజేస్తాయి అని ఈటెల వివరించారు. తిరిగి ఇచ్చే రుణాలలో కూడా బ్యాంకులు గతంలో ఇచినదానికంటే 15% అధికంగా ఇస్తాయని మంత్రి తెలిపారు. రూ.17వేల కోట్లలో రూ.4,250 కోట్లు చెల్లించగా మిగతా మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలనే దానిపై మంగళవారం సచివాలయంలోనే బ్యాంకర్లతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుందన్నారు. అనంతరం మిగతా మొత్తాన్ని ఏవిధంగా చెల్లించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాగం
రుణమాఫీ పథకం పర్యవేక్షణ, పథకానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం దృష్టికి వచ్చే ఫిర్యాదులను 30రోజుల్లో పరిష్కరించేలా సోమవారం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. మండల స్థాయిలో తహశీల్దార్ చైర్మన్‌గా, మండల వ్యవసాయాధికారి కన్వీనర్‌గా, బ్యాంకర్లు, ఎంపీడీవోతోపాటు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ఒకరు సభ్యులుగా ఉంటారు.

జిల్లాస్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా, జిల్లా బ్యాంకు మేనేజర్, జిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ఒకరు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, వ్యవసాయశాఖ కమిషనర్ కన్వీనర్‌గా, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, వ్యవసాయ కో-ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శి, ఫైనాన్స్ ప్రత్యేక కార్యదర్శి, ఫైనాన్స్ సలహాదారుడు, కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, ఏపీసీవోబీ ఎండీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చైర్మన్ సభ్యులుగా ఉంటారు.

బోగస్ పాస్‌పుస్తకాల రుణానికి వర్తించదు: పోచారం
బాన్సువాడ రూరల్: బోగస్ పాస్‌బుక్కులు బ్యాంకులో పెట్టి రుణాలు పొందిన వారికి రుణమాఫీ వర్తించదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. లంచాలు ఇచ్చి, దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి బ్యాంకులో రుణాలు పొందిన వారికి మాఫీ వర్తించదని తేల్చిచెప్పారు.

అటువంటి వారే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. నిజమైన రైతులు ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పంట నష్టపరిహారం గురించి సీమాంధ్ర పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 12.50 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 13 లక్షల మంది రైతులకు రూ.480 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. పెంచిన పింఛన్లను దసరా నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *