మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బసవేశ్వర వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని రాజధానిలోని ముఖ్య ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ప్రభుత్వం కోటి రూపాయలు అందజేస్తుందని సీఎం చెప్పారు. వీర శైవ లింగాయత్, లింగ బలిజల కోసం హైదరాబాద్ లో లింగాయత్ భవన్ కు ఎకరం భూమి, భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు పాఠ్యాంశాలలో పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. లింగాయత్ లను రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో చేర్చిందని, అయితే ఓబీసీల్లో చేర్చాలని తాను ప్రధానమంత్రికి లేఖ కూడా రాశానన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం మే 1 లోగా తయారుచేసి కేంద్రానికి పంపిస్తుందని, లింగాయత్ లను ఓబీసీలుగా కేంద్రం గుర్తించే బాధ్యతను కేంద్రమంత్రి దత్తాత్రేయ తీసుకోవాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, హోంమంత్రి నాయిని, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.