జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం జిల్లాకు కోటి చొప్పున మొత్తం రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేయాలని, జూన్ 2 నుండి 8 వరకు వారం పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవాలు నిర్వహించాలని, చివరిరోజు ముగింపు ఉత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. జూన్ చివరివారంలో విద్యాసంస్థలలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.
విద్యుత్ శాఖలో కొత్తగా 1919 ఇంజినీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా విద్యుత్ సంస్థల్లో పదవీ విరమణ, పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలు 681 ఉన్నాయి.. వాటిని కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం 2600 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి అనుమతి లభించినట్లైంది.
తీవ్రవాదులను మట్టుబెట్టే సమయంలో మరణించిన పోలీస్ కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 25 లక్షల నుండి రూ. 40 లక్షలకు పెంచే అంశంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 3620 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయాలని, సిరిసిల్లలో పవర్ లూం వీవర్స్ కు 2010-14 వరకు ఉన్న రూ. 7 కోట్ల 19 లక్షల టారిఫ్ కన్సెషన్ మంజూరు చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వేసవికాలంలో గ్రామాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై చర్చించి నివారణ చర్యలు తీసుకునేలా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద అవసరమైన నిధులు ఖర్చు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.