సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు. కూకట్ పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన స్త్రీనిధి(శ్రీనిధి) సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్త్రీనిధి పథకాన్ని తెలంగాణ పల్లె ప్రగతి పథకంతో అనుసంధానం చేస్తామని, సేవింగ్స్ పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.
మహిళా శక్తికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, స్త్రీనిధి(శ్రీనిధి) బ్యాంకులో రూ.165 కోట్లు ప్రభుత్వం తరపున జమయ్యాయని తెలిపారు. సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. దేశంలో ఐదంచెల ప్రభుత్వాలున్నాయని, కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.