రాష్ట్రంలో కొత్త పవర్ ప్రాజెక్టులకు రూ. 15 వేల కోట్ల రుణం మంజూరయ్యింది. ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, నల్గొండ జిల్లా దామరచర్లలో ఏర్పాటు చేయనున్న 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు తో పాటు సదరన్ పవర్ డిస్కమ్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పటిష్టత కోసం మరో రూ. 500 కోట్ల రుణం కూడా మంజూరు అయింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో జెన్కో సీఎండీ డీ ప్రభాకర్ రావు, పీఎఫ్సీ చైర్మన్ ఎంకే గోయల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇదిలాఉండగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు 0.5 శాతం తక్కువ వడ్డీకే రుణం ఇవ్వడానికి పీఎఫ్సీ అంగీకరించింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి పీఎఫ్సీ చైర్మన్ గోయల్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం పీఎఫ్సీ రుణాలపై 12 శాతం వరకు వడ్డీ రేటు ఉండగా, తెలంగాణ పవర్ ప్రాజెక్టుల కోసం వడ్డీ రేటులో 0.5 శాతం తగ్గిస్తున్నట్లు గోయల్ ప్రకటించారు. దీంతో జెన్కోకు రూ. 300 నుండి రూ. 400 కోట్ల మేరకు వడ్డీపై ఆదా కలుగుతుంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు(మణుగూరు) నిర్మాణానికి రూ. 6000 కోట్లు, నల్గొండ జిల్లా దామరచర్ల పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం రూ. 9,000 కోట్లు అందనున్నాయి.
మరోవైపు తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు అత్యంత వేగంగా అనుమతులిస్తున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్ లో ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రతిపాదనలు వచ్చిన నెల వ్యవధిలోనే 4 వేల మెగావాట్ల దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఈనెల 17న పర్యావరణ అనుమతి కూడా ఇవ్వబోతున్నామని మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మరోవైపు కొత్త పవర్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, పర్యావరణ అంశాల్లో కేంద్రం అనుమతుల కోసం ఇంధన శాఖ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనుంది.