శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాకులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విలేకరులతో సమావేశమై పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మార్చి 1 నుండి బీడీ కార్మికులకు జీవనభృతి కింద రూ. వెయ్యి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్రం మొత్తం దీనిని అమలు చేస్తామని చెప్పారు. తొలి రోజే లక్షా 70 వేల మంది బీడీ కార్మికులు దీనిని అందుకోనున్నారని, మరో 50 నుండి 70 వేల మందికి కూడా భృతి ఇచ్చేందుకు తాము సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో కొందరికే పీఎఫ్ కార్డు నంబర్లు ఉన్నాయని, బీడీ కంపెనీలు స్వార్ధంతో పీఎఫ్ కార్డులు ఇవ్వడంలేదని, తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్ లో 1.10 లక్షల మందికి పీఎఫ్ కార్డులు ఇప్పించానని అన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే 4.90 లక్షలమంది బీడీ కార్మికులు ఉన్నట్లు తేలిందని, దీన్ని వెరిఫై చేయించామని పేర్కొన్నారు. వెయ్యి రూపాయల భృతి పొందేవారిలో డూప్లికేషన్ ఉండొద్దని, ఆడిట్ లో ఒప్పుకోరని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 4.90 లక్షల బీడీ కార్మికుల్లో 1,40,819 మంది ఇప్పటికే ఆసరా పథకం కింద పెన్షన్లు పొందుతున్నారని, వీరిలో వికలాంగులు, వితంతువులు ఉన్నారు.. పీఎఫ్ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అట్లా మరో లక్ష మంది ఉన్నారు. మొత్తం 2.40 లక్షల మంది పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే కాగ్ తప్పుపడుతుంది. మిగతా 2.5 లక్షల మందిలో 1.70 లక్షల మంది బీడీ కార్మికులకు భృతి ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశామని కేసీఆర్ ప్రకటించారు.
స్కీమ్ లో లేనివాళ్ళు మరో 70-80 వేల మంది ఉంటారని, వారిలో కొంతమంది మైనర్లు ఉన్నారని, వారికి ఇస్తామంటే చట్టం ఒప్పుకోదన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోనివారు ఎమ్మార్వో ఆఫీసుకు పోయి దరఖాస్తు పెట్టుకుంటే 10 రోజుల్లో వెరిఫై చేయించి మార్చి నెల పెన్షన్ కూడా ఇస్తామని సీఎం తెలిపారు. కార్మిక సంఘాల నేతలు ఏం చేసినా పెన్షన్లు రావు.. నీను సీఎంగా చెప్తున్నా.. ప్రభుత్వం ఇచ్చే దానికి ఒక పద్ధతి, ఎంపిక, వెరిఫికేషన్ ఉంటది. మీకు కార్మికులకు న్యాయం చేయాలని ఉంటే ఎమ్మార్వో దగ్గరికి తీసుకెళ్ళి దరఖాస్తు పెట్టించండి. వారం రోజుల్లో వెరిఫై చేయించి మార్చి నెల భృతి కూడా ఇస్తాం. అంతేకానీ ధర్నాలు, ఆందోళనలు చేసి మేం నాయకులం ఐతాం అంటే మంచిది కాదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే 1.7 లక్షల మందికి ఇస్తున్నామని, మరో 50-70 వేల మందికైనా ఇస్తాం కానీ లేనిపోని ఆందోళనలు, గడబిడ చేస్తే లాభం ఉండదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.