యాదగిరిగుట్ట అభివృద్ధికై వచ్చే బడ్జెట్ లో రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన యాదగిరిగుట్ట అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు. వందేళ్ళ నాటి పురాతన దేవాలయాన్ని తలపించేవిధంగా గుట్ట డిజైన్ రూపొందించాలని, వారసత్వ ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా దేవాలయం ఎలివేషన్ లో అద్భుతమైన శిల్పకళలు ఉండాలని, పంజాబ్ లోని అమృత్ సర్ దేవాలయం, ఉత్తర భారతదేశంలోని అక్షర్ ధామ్ ఆలయాల నిర్మాణాలను అధ్యయనం చేసి డిజైన్ లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
యాత్రికుల సౌకర్యం కోసం విశ్రాంతి గదులు, వసతి గృహాలు తదితర సౌకర్యాలతో భక్తులకు బస ఏర్పాట్లు చేయాలని, గుడి చుట్టూ ఉన్న 10 ఎకరాల స్థలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణమండపం, యాగశాల ఏర్పాటు చేయాలని సూచించారు. గుట్టలో సెంట్రలైజ్డ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, గుట్టపైకి వెళ్లేందుకు రెండు లైన్ల రహదారిని నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు, స్తపతి సౌందర్య రాజన్, ఆర్కిటెక్ట్ లు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా సీఎం కేసీఆర్ రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. గుట్ట అభివృద్ధిపై అక్కడి అధికారులతో సమావేశమై చర్చిస్తారని తెలిసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న స్వామివారికి సీఎం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.