mt_logo

అడుగడుగునా ఘనస్వాగతం

తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాడి విజయాన్ని సాధించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎక్కడికెళితే అక్కడ ఘనస్వాగతం లభిస్తుంది. తెలంగాణ వచ్చాక మొదటిసారి సిరిసిల్లకు వచ్చిన ఎమ్మెల్యేలు కేటీఆర్, ఈటెలకు తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయొద్దని వేల సంఖ్యలో ప్రజలు మెసేజ్ లు పంపించారని, వారి కోరిక మేరకే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలేదని కేసీఆర్ చెప్పారన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునేందుకు పదేళ్ళు పట్టిందని విమర్శించారు. తెలంగాణ బిడ్డల బలిదానాలు చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అప్పుడు ఇవ్వలేదని, ఆ తర్వాత కూడా ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. చరిత్రను తిరగరాసాం, పోరాటాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజల ఎజెండా అమలు చేస్తామని చెప్పారు. ఉద్యమకారుల వీపులు పగలగొట్టిన ద్రోహులే నేడు నీతివాక్యాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజల ఋణం తీర్చుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పంటపొలాలకు నీళ్ళు రావాలని, గ్రామాల్లో వలసలు ఆగి నేతన్నల బతుకులు మారాలి అని అన్నారు. నేతన్నల ఆకలి చావులు చూసి, ఆత్మహత్యలు చూసి చలించి కేసీఆర్ బిచ్చమెత్తి 50 లక్షల రూపాయలు పోగుచేసి సంక్షేమనిధి ఏర్పాటుచేసారని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *