mt_logo

రాజ్యాంగ వ్యతిరేక ఆర్డినెన్స్-కేసీఆర్

తెలంగాణ ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖను వ్రాశారు. లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో అనేక గ్రామాలు ముంపుకు గురవుతాయని, పెద్ద సంఖ్యలో గిరిజనులు నిరాశ్రయులు అవుతారని, వారిని ఆదుకోవడానికి భారీ ప్యాకేజీ కావాలని వివరించారు. బిల్లులో ఈ అంశాలేవీ లేవని, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ నుండి ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం చేసిన ఈ ఆర్డినెన్స్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సమస్య వస్తుందని, ఏడు మండలాలు ఆంధ్రకు వెళితే లోయర్ సీలేరు కింద ఉన్న 450 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం కోల్పోతుందని, తెలంగాణకున్న విద్యుత్ లో కూడా వేటు పడుతుందని స్పష్టం చేశారు. ఆర్టికల్ 3 కి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రపతికి వివరించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు సమస్య కూడా ఏర్పడుతుందని తెలుపుతూ 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ నిర్ణయానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండేలా చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *