తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు కానున్నది. ఇందుకోసం సుమారు 200 ఎకరాల స్థల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎయిమ్స్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కేంద్రం కొద్దిరోజులకింద లేఖ కూడా రాసింది. త్వరలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని, స్థలాన్ని చూపించాలని కోరింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో స్థలసేకరణపై ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ మంజూరు చేసింది. స్థలంతో పాటు రోడ్లు, మంచినీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు రాష్ట్రం కల్పిస్తే కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఎయిమ్స్ ఏర్పాటుతో మెడికల్ కాలేజీతో పాటు అత్యాధునిక దవాఖాన రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుండగా, మరో వంద మెడికల్ సీట్లు అదనంగా రాష్ట్రానికి దక్కుతాయి. రూ. 840 కోట్లతో ఏర్పాటయ్యే ఈ ఆస్పత్రికి సంబంధించి నిధులు, నిర్వహణ తదితర బాధ్యతలు మొత్తం కేంద్రమే చూసుకుంటుంది.