mt_logo

రివర్‌బోర్డులపై అత్యుత్సాహం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సంబంధించి గోదావరి, క్రిష్ణా నదుల మేనేజ్‌మెంట్ బోర్డుల నియామకం వెంటనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర అపాయింటెడ్ డే తర్వాత అరవై రోజుల వరకు బోర్డులను నియమించుకోవచ్చునని సెక్షన్ 85ప్రకారం ఉన్నా, అంతకంటే ముందుగానే బోర్డులు ఏర్పాటు చేయడం చూస్తే తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తెలంగాణకు చెదిన కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు బోర్డుల్లోనూ సీమాంధ్రకు చెందిన వారినే నియమించే కుట్రలు జరుగుతున్నాయని, సెక్షన్ 86ప్రకారం, డిప్యుటేషన్‌పై నియమించిన అధికారులను తర్వాత విలీనం చేసుకునే అవకాశం ఉందని, స్థానికేతరులైన ఇంజినీర్లు, సిబ్బందిని తీసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి నష్టం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా బేసిన్‌లో నదీజలాలను ప్రాజెక్టుల ద్వారా పంపిణీ చేయడానికి జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను పొడిగించినందున నదీబోర్డులకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పనిలేదని, బోర్డులో ఒకసారి నియమించిన అధికారులను ఏడాదికొకసారి మార్చాలని తెలంగాణ ఇంజినీర్ల జేఏసి కో చైర్మన్ శ్రీధర్ దేశ్‌పాండే పేర్కొన్నారు. నదీబోర్డులకు అధికారాలు ఇవ్వడం వల్ల పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం నీటి పంపకాలు జరుగుతున్నాయా? లేదా? అన్న అంశాలనే అవి చూసుకోవాలని రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కె్ఎస్ఎన్ రెడ్డి తదితరులు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *