mt_logo

రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశముంటే మద్దతు ఇస్తాం- కేసీఆర్

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశముంటే తప్పకుండా మద్దతు ఇస్తామని, ఎన్‌డీఏకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, సోనియా పట్ల కృతజ్ఞతతో ఉంటామని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే తొలి మద్దతు తమదేనని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ భవన్‌లో ఈరోజు జరిగిన కార్యవర్గసమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో నూటికి నూరుశాతం టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, 60 నుంచి 90 స్థానాలు వచ్చే అవకాశముందని అన్నారు. తమకు మెజారిటీ స్థానాలు వస్తాయని, క్యాంపులు పెట్టే పరిస్థితి టీఆర్ఎస్‌కు రాదని, దక్షిణ తెలంగాణలోనూ గెలుపు సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి 25నుంచి 35లోపే స్థానాలు వస్తాయని, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడదని అన్నారు. పీసీసీ చీఫ్ పొన్నాల బ్రోకర్ పనులు చేస్తున్నాడని, 20మంది టీఆర్ఎస్ నేతలు తనతో టచ్‌లో ఉన్నారని పొన్నాల చెప్పడం నీచ రాజకీయాలను సూచిస్తుందని కేసీఆర్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *