mt_logo

మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్న ఆర్ఎస్ఎస్ మూలలున్న ముఖ్యమంత్రి రేవంత్: కేటీఆర్

అర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీల పైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితికి మద్దతు అందించారని అందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల గురించి పట్టించుకోవడం లేదన్నారు.

ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనార్టీలకు రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. 1953 తర్వాత తొలిసారి రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరు గెలవలేరు అన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని, మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చన్న విషయం కాంగ్రెస్ కావాలనే మరిచిపోయిందన్నారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాల కన్నా ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసి పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బిజెపితో పోటీ పడుతుందన్నారు.

ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ పేరు వాడుకుందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేవలం సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మైనార్టీలకు మంత్రి పదవికాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వడం అంటే మైనార్టీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమే అన్నారు.

రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమం పైన సమీక్ష నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని, ముస్లిం కోటాను పెంచడం, రూ. 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాల పైన తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు.

గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయని తాము హెచ్చరించామని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్గొండ మరియు అనేక ఇతర ప్రాంతాల్లో జనవరి 22వ తేదీన మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. మత ఘర్షలను ఆపకుండా కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పైన కేటీఆర్ మండిపడ్డారు. హోం శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే మత ఘర్షణలకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మత ఘర్షణల అనంతరం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం, జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు

గత ప్రభుత్వం హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని విస్తృతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి. మైనార్టీలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ విధానాల పట్ల నమ్మకం ఉంచి పార్టీకి పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో మైనార్టీలు మద్దతు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టిన మైనార్టీ సోదరులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లబ్ధి చేకూర్చేలా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే మాదిరిగా బిజెపికి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందన్నారు. బిజెపి కాంగ్రెస్ లు అనేక ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పని చేశాయని విమర్శించిన కేటీఆర్, రానున్న ఎన్నికల కోసం ఇదే తీరుగా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని కోరారు.