ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ఆర్డీఎస్ విషయంలో సీమ గూండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నదని, భారీ నీటిపారుదల శాఖా మంత్రి టీ హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆధునీకరణ పనులవద్ద కేంద్ర బలగాలను పెట్టి పనులు పూర్తిచేస్తాం. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం అని హరీష్‌రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలంపూర్ నుండి ఎరిగేర వరకు 48 కోట్ల రూపాయలతో వేసే రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు.
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిన మంత్రి వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఆర్డీఎస్ ను పట్టించుకోకపోవడం వల్లే నేడు రైతులకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని, ఆర్డీఎస్ కింద ఉన్న 87,500 ఎకరాలకు నీరు పారించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాకో ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయాలను నెలలోపు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలుచేస్తామని, అభివృద్ధి అంటే ఏమిటో ఐదేళ్ళలో చేసి చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యకు చంద్రబాబే కారణమని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా చంద్రబాబు తెలంగాణలో తన మార్కు చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడని, విద్యుత్ విషయంలో కూడా అడ్డు తగులుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొరతను తప్పించడానికి ఇతర రాష్ట్రాలనుండి 5వేల మెగావాట్ల విద్యుత్ ను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, పరిశ్రమలకు కోత విధించైనా సరే రైతులకు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.