Mission Telangana

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ప్రొ. పాపిరెడ్డి నియామకం

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం జీవోను విడుదల చేశారు. ఈ మండలిలో పాపిరెడ్డితో పాటు వైస్ చైర్మన్ కూడా ఉంటారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, ఆర్ధికశాఖ కార్యదర్శి, యూజీసీకి చెందిన ఒక అధికారి లేదా ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ(హైదరాబాద్), తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్శిటీల వైస్ చాన్సలర్లు ఉంటారు. వీరే కాకుండా నలుగురు ప్రఖ్యాత వ్యక్తులను, పారిశ్రామికరంగానికి చెందిన ఒకరిని, నామినేషన్ పద్ధతిలో మరో ముగ్గురు సభ్యులను ఈ మండలిలో నియమిస్తారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాపిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి కేసీఆర్ కంటున్న కలలను సాకారం చేస్తానని, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న తనను సీఎం కేసీఆర్ గుర్తించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఉన్నత సాంకేతిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం కోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మండలి చైర్మన్ గా కృషి చేస్తానని అన్నారు. ఎంసెట్ విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంజినీరింగ్ కాలేజీలలో మెరుగైన విద్యావిధానం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వీసీల నియామకం సీఎం దృష్టికి తెస్తానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *