mt_logo

రాయల తెలంగాణ రావణకాష్టమవుతుంది

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

రాయల తెలంగాణ ఏర్పడబోతుందని మీడియా, కొందరు రాజకీయ నాయకులు జోస్యం చెప్పడం వింటున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కాక పూర్వం అంటే 31-10-1956 నాడు హైదరాబాద్ రాష్ట్రం పేరుతో తెలంగాణ ఏ సరిహద్దులతో ఉండేదో అదే ఏర్పడబోతుందని నా నమ్మకం. రాయల తెలంగాణ అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు తెలంగాణతో కలిసి ఏర్పాటు చేసే రాష్ట్రమన్నమాట. అలాంటిది కావాలన్నది రాయలసీమ ప్రాంత నాయకుల కోరిక. రాయలసీమ వారు, ముఖ్యంగా అక్కడి నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ ఏర్పాటుచేయాలని అనడం చూస్తున్నాం. కానీ ఇది పైపైకి అంటున్నమాటే. ప్రత్యేక రాష్ట్రంగా నాలుగు జిల్లాలను కలిపి ఏర్పాటు చేస్తే అది సాధ్యం కాదనీ, అంటే మనుగడ సాధించలేదని ఆ నాయకులకు తెలుసు.

అందల మెక్కిస్తే అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధపడే రాయలసీమ నాయకుల బలహీనతను 30 సంవత్సరాలుగా వాడుకుంటూ రాష్ట్ర ఆర్థికవనరులు యావత్తూ కోస్తా జిల్లాలకే వినియోగించారు. రాయలసీమవాసుల మీసాలకు సంపెగనూనెతో సంభావించి, సంపదనంతా సర్కార్ జిల్లాలకు పంచిపెట్టారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాయలసీమ ఎంత నిర్లక్ష్యానికి గురిచేయబడిందో అంచనా వేస్తే రాయలసీమ నాయకులనెవ్వరినీ భావితరాలు క్షమించవు. నదీ జలాల వాటాను పోగొట్టి పైర్లను ఎండగట్టారు. ఉద్యోగ అవకాశాలు చేజార్చి చదువుకున్న వారిని మాడగొట్టారు. విద్యాసౌకర్యాలు నిర్లక్ష్యం చేసి ప్రజాచైతనాన్ని తొక్కిపట్టారు. ప్రతిరంగంలోనూ రాయలసీమను వెనక్కునెట్టి ప్రజాజీవితాన్ని శవప్రాయం చేశారు.

’ఇదండీ రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర వాసుల పట్ల ఉన్న ప్రేమ. ‘ఆంధ్రోద్యమం -రాయలసీమ’ అన్న మరో వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే వాళ్ల ఏవగింపు మరింత సుస్పష్టమవుతుంది.

‘ఒక వైపు కరువు వేపుకు తింటుంటే మద్రాసులో సర్కార్ కోస్తాంధ్ర వారు రాయలసీమ వారికన్నా తాము నాగరికులమని వివక్ష చూపారు. దీంతో ప్రాంతీయ సోదరత్వానికి అవకాశమే లేకుండాపోయింది. రాయలసీమ వారిని చిన్నచూపు చూడటం జరుగుతూ వచ్చింది. సీమవాసులకు ఉద్యోగాలలో అటు అరవలో, ఇటు సర్కార్‌వారో అడ్డుపడుతూ వచ్చారు. చెన్నై రాజధాని నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపడుట లాభకరమైనచో? ఆంధ్ర రాష్ట్రం నుంచి రాయలసీమ విడువడుట మరింత లాభకరముకదా! ఉత్తరాది (కోస్తాంధ్ర, మనలను ఎర్రమలకొండలు వేరు చేయుచున్నవి) వారి భాష, ఆహార వ్యవహారములు వేరు. కావున వారితో పొత్తు కుదరదు. (పప్పారి రామానుచార్యులు, సాధన పత్రిక సంపాదకులు)

‘మా బీద మండల మూలధనము ఉత్తర సర్కారులకు ప్రవహించిపోవుచున్నది. అక్కడ నుంచి పైసా తిరిగి వచ్చుటలేదు.(టి.భుజంగరావు, అనంతపురం)

బళ్ళారిలో సమావేశమైన సీమ మహాసభ కార్యవర్గం ‘సీమ ఆర్థిక అవసరమును, కోర్కెలను పూర్తిగా సంతృప్తి పరిచేంత వరకు, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని సీమవాసులు వ్యతిరేకిస్తారు’ అని తీర్మానించడం జరిగింది. 5వ రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి అధ్యక్షోపన్యాసంలో ‘అందుచేత మనకు రాజ్యం రాముడేలినా, రావణుడు ఏలినా ఒక మనసత్తం ఏర్పడానికి కారణమైంది. మనకు రాష్ట్ర ప్రసక్తి ఉత్సాహమును రేకెత్తించలేకుండా పోతున్నది. వేరే రాష్ట్రం వచ్చినా మనకు మోక్షం కలుగుతుందనే ఆశ, ఇప్పటి మన ఉత్తరాది సోదరుల(కోస్తాంధ్ర) ఉపేక్షభావం చూస్తే సన్నగిల్లుతోంది.’

ఇవన్నీ చూశాక.. రాయలసీమ వారికి ఏ పరిస్థితుల్లోనూ కోస్తాంధ్ర వారితో కలిసి సహజీవనం సాగించాలన్న ఆలోచన లేదు. ప్లానింగ్ కమిషన్ వారు ఆమోదించిన కృష్ణ, పెన్న ప్రాజెక్టు రాకుండా అడ్డుపడ్డది కోస్తాంధ్ర వారే అని వారి దృఢాభిప్రాయం. కోస్తాంధ్ర పట్ల సీమ వారి ఆగ్రహానికి అదికూడా ప్రధాన కారణం. అంటే అటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా బతకలేక, ఇటు కోస్తాంధ్ర వారితో మనుగడ సాగించలేని ఇరకాట పరిస్థితులు రాయలసీమ వారికి ఉన్నవి. రెండు ప్రత్యామ్నాయాలు, సమైక్యాంధ్రలోనే కొనసాగడం, లేదా తప్పని పరిస్థితుల్లో తెలంగాణతో జతకట్టి రాయలసీమ ఏర్పాటుకు సై అనడం.

మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర వారితో రాయలసీమ వారు చవిచూసిన చేదు అనుభవాన్నే 56 సంవత్సరాల నుంచి తెలంగాణవారు పొందుతున్నారు. కనుకనే ప్రత్యేక రాష్ట్రం గురించి తెలంగాణ వారు నిరంతరం పోరాటం సాగిస్తూ గమ్యం దరిదాపుల్లోకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ వారికి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కోస్తాంధ్ర వారి తడిగుడ్డతో గొంతుకోసే తత్వం, రాయలసీమ వారి ఫాక్షనిజం రుచి చూసిన తెలంగాణవాదులు ససేమిరా అంటున్నారు.

సీమవారితోనూ, ఇటు కోస్తా వారితోనూ తెలంగాణ వారు కలిసి ఉండలేరన్నది నిజం. తెలంగాణ వారిని ఒప్పించలేమని తెలుసుకున్న కొందరు సీమ నాయకులు (టీజీ లాంటి వారు) కేంద్రంపైన ఒత్తిడి చేసి నాలుగు జిల్లాలు కాకపోతే కనీసం అనంతపురం, కర్నూలునైనా తెలంగాణతో కలిపి విడిగా రాష్ట్రం చేయాలని కోరుతున్నారు. వారి స్వార్థం వారిది. కేంద్రం కూడా తెలంగాణ వారిపై ఒత్తిడి తెచ్చి కర్నూలు, అనంతపురంతో కలిపి రాయల తెలంగాణ చిత్తూరు, కడపతో కలిపి ‘రాయలాంధ్ర ఏర్పాటు చేసే దిశలో ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఏర్పడే సరికొత్త తెలంగాణ రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం కలిస్తే ఏమవుతుందో పరిశీలిద్దాం. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో సరిగ్గా సగం 147 స్థానాలు. ప్రస్తుత తెలంగాణ 119. కర్నూలు,అనంతపురం 28మంది శాసనసభ్యులు. అలాగే 21 పార్లమెంట్ సభ్యులు ఉండటం కలిసి వచ్చే అంశం.అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం రాయలసీమలో బలంగా ఎదిగిపోతున్న కొత్త పార్టీని ముక్కలు చెక్కలు చేయడం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి అనుకూలఅంశం. కర్నూలు, అనంతపురం జిల్లాలు రెండు కూడా కృష్ణా బేసిన్‌లోనివే. మిగతా రెండు జిల్లాలు కావు. అనంతపురం జిల్లాలోని 23.6 శాతం వైశాల్యం, కర్నూలు జిల్లాలోని 42.4 శాతం వైశాల్యం కృష్ణా పరీవాహక ప్రాంతంలోనే, అంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది.

పెన్నానది కూడా కొత్త రాష్ట్రంలోకి వస్తున్నది. పెన్నాపైన నిర్మించిన జుర్రేరు (కర్నూలుజిల్లా), మూడవది- ఎగువ పెన్నార్ (అనంతపురం) మధ్యతరహా ప్రాజెక్టులు కూడా కొత్త రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. అంటే కృష్ణా,గోదావరితోపాటు పెన్నానది కూడా అంతర్ రాష్ట్ర వివాదాల చట్టం కింద సమస్యల పరిష్కారాలకు లోనవుతాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం పూర్తిగా కొత్త రాష్ట్రంలో ఉన్నా సాగర్ నీళ్లు ఆంధ్రకు, శ్రీశైలం కుడి కాలువ నీళ్లు కర్నూలుతోపాటు, కడపకు అందుతుండటంతో ఈ ప్రాజెక్టులు కూడా, తుంగభధ్రలాగా కంట్రోల్‌బోర్డు అధీనంలో ఉంటాయి. ఇక ఆర్‌డీఎస్‌తోపాటు సుంకేశుల కూడా కొత్త రాష్ట్రం పరిధి కిందికే వస్తాయి. ఇక పోతిరెడ్డిపాడు పంచాయితీ ఉండనే ఉన్నది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి అనధికారంగా, అక్రమంగా తరలించే నీళ్లకు బ్రేకుపడుతుందా లేదా అన్నది కొత్తరాష్ట్రం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి బయల్దేరే దిగువ ఎగువ కాలువల సమస్యలు, కేసీ కాలువ సమస్యలన్నీ కొత్త రాష్ట్రాన్ని చుట్టు ముట్తాయి. ఇదివరకే సీమాంధ్ర నాయకుల కుట్రలవల్ల కునారిల్లుతున్న తెలంగాణ నెమ్మదిగా వారి పంజా నుంచి అనేక త్యాగాల ఫలితంగా బయటపడినది.

కృష్ణా, గోదావరి నదుల నీటితో తెలంగాణ నేలను సస్యశ్యామలం చేయాలనుకుంటున్న తెలంగాణ ఇంజనీర్ల కలలు కొత్త జిల్లాలు తెలంగాణలో కలిస్తే భగ్నమవుతాయి.1956కు పూర్వం ఉన్న ‘తెలంగాణ’ను యధా స్థితిలో పొంది, దాన్ని పునర్నిర్మాణం చేసి హర్యానా లాగ పదేళ్లలో దేశంలో అగ్రగామిగా నిలుపుదామన్న వారి ఆశలపై నీళ్లు చల్లటమవుతుంది. తెలంగాణ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, సకల జనులు, ఒకవేళ కర్నూలు, అనంతపురం జిల్లాలను కేంద్రం బలవంతంగా తెలంగాణకు జత కలపడానికి ప్రయత్నిస్తే శాయశక్తులా వ్యతిరేకించాలి. కొత్త జిల్లాలు కలపటం వల్ల తెలంగాణకు వీసమెత్తు కూడా లాభం కలగదు. కర్నూలు జిల్లాకు నీటి పారుదల సౌకర్యాలు మెండుగా ఉన్నా, అనంతపురం పూర్తిగా వెనుకబడిన జిల్లా కనుక కొత్త రాష్ట్రానికి గుదిబండగా తయారవడం తథ్యం. కేంద్ర ప్రభుత్వానికి కర్నూలు, అనంతపురంలను తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే తలనొప్పి తగ్గుతుందేమో కానీ, కొత్త రాష్ట్రంలో వాటి మూలంగా తెలంగాణ వారికి కొత్త తలనొప్పులు వస్తాయి.తస్మాత్ జాగ్రత్త!

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *