mt_logo

1950ల్లో తెలంగాణ తల్లిపై రావెళ్ల రాసిన గేయం

 

1950ల్లో  రావెళ్ల వెంకట రామారావు గారి కలం నుండి జాలువారి, దేశపతి శ్రీనివాస్ గాత్రంతో కొత్త ఊపిరిపోసుకుని  తెలంగాణ ప్రాంతం మొత్తం మీద బహుళ ప్రజాదరణ పొందింది “నా తల్లి తెలగాణ” గీతం.

ఈ గీతం పూర్తి పాఠం కింద చదవండి:

***

 

కదనాన శత్రువుల కుత్తుకల నవలీల
నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి
ధీరులకు మొగసాలరా!
తెలగాణ వీరులకు కాణాచి రా!

 

అబలయని దేశమును కబళింప తలపడిన
పర రాజులకు స్తీల పటుశౌర్యమును జూపి
రాజ్యతంత్రము నడిపెరా!
తెలగాణ రాణి రుద్రమదేవిరా!

 

కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును
వేయి కంబాలలో వెలయించి మించినది
అడుగడుగు శిల్పాలు రా!
తెలగాణ ఆలయపు శిఖరాలురా!

 

వర్ణ సహసత్వమున వనలతల మరపించు
లాలిత్య రేఖావిలాసాల చిత్రణలు
ఆనాటి చిత్రాలురా
తెలగాణ ఆలయపు కుడ్యాలురా!

 

కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి
భోధిసత్వుని ధర్మ బోధనల నేర్పించె
శ్రీగిరి చైత్యమ్మురా!
తెలగాణ చైతన్యమును చాటెరా!

 

శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతలలో
బసవన్న శివతత్వ పారవశ్యములోన
ఉర్రూతలూగిందిరా!
తెలగాణ వెల్లువై పొంగిందిరా!

 

కవితలో విక్రాంతి కాహళిని పూరించి
కమ్మ తెనుగున తేట కావ్యాలు విరచించె
పాల్కురికి ఆనాడెరా!
తెలగాణ ప్రగతి బాటలు దీర్చెరా!

 

భాషా వధూనయన భాష్పతతి వణగింప
రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించె
కృషికుడై జీవించెరా!
తెలగాణ కవిరాజు పోతన్నరా!

 

భూగర్భమున గనులు, పొంగిపారెడు నదులు
శృంగార వనతతుల బంగారముల పంట
నా తల్లి తెలగాణరా !
వెలలేని నందోద్యానమ్మురా!

 

 [గమనిక: తెలగాణ అనేది తెలంగాణ అనే పదానికి సమానార్ధకం] 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *