ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్ళిన సీఎం కేసీఆర్ అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరుపనున్నారని సమాచారం. కేంద్రం నుండి తెలంగాణకు రావలసిన సాయం, రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీని కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటానుంది 500 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు అదనంగా కేటాయించాలని, హైదరాబాద్ లో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇవేకాకుండా పలు అంశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ మోడీతో చర్చించనున్నారు.
ప్రధానితో బేటీ అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. హైదరాబాద్ లో శాంతిభద్రతల అంశంపై గవర్నర్ కు బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించడమే అని వివరించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి తెలంగాణకు కేంద్రం నుండి అందాల్సిన విద్యుత్, ఉన్నత విద్యాసంస్థలు, ప్రత్యేక హైకోర్టు, పరిశ్రమల స్థాపన తదితర అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు ఉన్నారు.