mt_logo

ధీరత్వం చాటుదాం

ప్రపంచంలో తలెత్తుకునేలా అభివృద్ధి
ఇక ముందు జరిగేది
పునర్నిర్మాణ ఉద్యమం: సీఎం కేసీఆర్
-బయ్యారంలో త్వరలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు
-ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోదాం
-కొత్తగూడెం కేంద్రంగా ఖమ్మంలో మరో జిల్లా
-తుమ్మల చేరిక సభలో ముఖ్యమంత్రి
-రాజకీయ దురంధరుడని తుమ్మలకు కితాబు

తెలంగాణ ధీరత్వాన్ని ప్రపంచానికి చాటాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇకముందు జరిగేది తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమమని ఉద్ఘాటించారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను దేశంలో, ప్రపంచంలో ధీరత్వం కలిగిన ధీశాలిగా చూపాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ను నేను ఇంక రాజకీయ పార్టీ అనుకుంటలేను. ఇప్పటిదాక జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. ఇకముందు జరిగేది తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ముఖ్యం కాదు.

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను దేశం, ప్రపంచంలోనే ధీరత్వం, ధీశాలిగా చూపాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించాలి. యావత్తు తెలంగాణ ఏకమై బంగారు తెలంగాణను సాధించి, చూపించాలి అని ముఖ్యమంత్రి అన్నారు. టీడీపీకి చెందిన ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులతోపాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు, 16 మంది ఎంపీపీలు, 16 మంది జెడ్పీటీసీలు, 165 మంది సర్పంచులు, టీడీపీకి చెందిన వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా ఇదే కార్యక్రమంలో గులాబీ నీడకు చేరారు. నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, వైఎస్సార్సీపీకి చెందిన వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరలేదని, ఉద్యమంలో చేరారని అభివర్ణించారు. తెలంగాణకు తలమానికమైన ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఇప్పుడు సంధి సమయంలో ఉంది. ప్రబలమైన మార్పులో ఉంది. ఈ సమాజం శతాబ్దకాలంగా పోరాటం చేస్తూ, కన్నీరు పెడుతూనే ఉంది. అనేక బాధలు, ఒత్తిళ్లు, ఉద్యమాలు, బలిదానాలు. తెలంగాణలో వేలమంది బతుకులు కోల్పోయిండ్రు. రాజుల పాలనలో గడీల దొరలు రాసిరంపాన పెట్టిన రాక్షస పాలనలో తెలంగాణ వేదన పడింది. అనంతర పరిణామక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో భయంకర ఒత్తిడితో బతుకుతూనే వచ్చింది. హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన అనతి కాలంలోనే… శ్వాస పీల్చుకొనీపీల్చుకోకుండానే ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై వలసపాలన ఇనుప పాదాల కింద నలిగింది. ఆతర్వాత 1969 ఉద్యమ పరంపర. ఈదఫా యావత్తు తెలంగాణ ఏకమై, ఐక్య ఉద్యమాన్ని నడిపింది. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తనకు తాను రాష్ట్రంగా నిలబడింది అని కేసీఆర్ వివరించారు. ఒక రాష్ట్రంగా బతకాల్సిన తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

ఆశ్చర్యపడేలా అభివృద్ధి చేద్దాం…
ఖమ్మం జిల్లాను అందరూ ఆశ్చర్యపడేలా అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణకు తలమానికం. ఖనిజ, అటవీసంపద సహా అనేక సహజ వనరులతో నిండి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ఖమ్మం జిల్లా పెద్దది. ఇప్పుడు కూడా పెద్దదే. అందుకే రెండు జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసుకుందాం అన్నారు. కృష్ణా, గోదావరి.. రెండు బేసిన్ల మధ్య ఉన్న ఈ జిల్లాకు అన్యాయం జరిగింది. నాగార్జునసాగర్ కాలువ గార్ల, ఇల్లందు వరకు పోవాల్సి ఉండె.

కానీ దాన్ని వంకర తిప్పి, తెలంగాణ నోట్లో మట్టి కొట్టిండ్రు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మెడలు వంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది అని చెప్పారు. జిల్లాలో ప్రతి అంగుళం భూమి కూడా కళకళలాడాలి. గతంలో బయ్యారంలో దొరికే ఐరన్ ఓర్ తక్కువ గ్రేడ్ అని తప్పుడు ప్రచారం చేసిండ్రు. కానీ మొన్ననే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నాతో కలిసిండ్రు. అదేం లేదు… నెంబర్ ఐరన్ ఓర్ ఉందని చెప్పిండ్రు. రూ.30వేల కోట్లతో త్వరలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా పెడ్తనన్నరు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2వేల కోట్ల వాటా తీసుకోమన్నరు. త్వరలో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటవుతుంది. 10వేల మందికి ఉద్యోగాలు లభిస్తయి. సింగరేణి ద్వారా కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుందాం. సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోవాల్సి ఉంది అని సీఎం చెప్పారు.

త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటిస్త..
గతంలో మాదిరిగా కాకుండా ఇతర జిల్లాల్లెక్కనే ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువసార్లు పర్యటిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తుమ్మల నాకు ఆప్తమిత్రుడు. 1982లో తొలిసారి ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేసినం. ఆయన సత్తుపల్లి నుంచి, నేను సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినం. అన్న ఎన్టీఆర్ మాకు బీ-ఫారం ఇచ్చిండు. ఇద్దరం కష్టనష్టాలను పంచుకున్నం. ఒత్తిళ్లకు లోనైనం. ఆతర్వాత మేం వేరువేరుగ పనిచేసినా.. వ్యక్తిగత సంబంధాలు తెగలేదు. భావాలు పంచుకుంటూనే ఉన్నం అని సీఎం తెలిపారు. ఎన్నికల ముందు నేను తుమ్మలతో మాట్లాడిన. మీ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నేనే వస్తనన్నడు. ఆ మాట మీదే..

నేనే స్వయంగా ఆహ్వానించిన. తుమ్మల రాజకీయ దురంధరుడు. ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి, మచ్చలేని నాయకుడుగ ఉన్నడు. నిప్పులాగ ఉన్నడు. ఖమ్మం జిల్లాను అవపోసస పట్టిన వ్యక్తి. అణువణువూ ఆయనకు తెలుసు. పాత, కొత్త మిత్రులను కలుపుకొని పోయి, జిల్లాలో పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఆయన్ని కోరుతున్న అని కేసీఆర్ చెప్పారు. ఇంక ఐదేండ్ల దాక రాజకీయాలు లేవు. స్థానిక ఎన్నికలు కూడా అయిపోయినయి. ఈ ఐదేండ్ల పాటు ఎన్నికలు, రాజకీయాలు కాకుండా కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలి. తుమ్మల నాయకత్వంల ఖమ్మం జిల్లాను బాగు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల ఉన్నందున పక్క రాష్ట్రమోళ్లు ఔరా.. అని ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేసుకునేందుకు శ్రీకారం చుడుదాం. గతంలో ఖమ్మం అంటే ఒక ఫీలింగు ఉండేది. సార్.. మా జిల్లాను చిన్నచూపు చూస్తున్నరు, తక్కువసార్లు వస్తరు అనేవారు. అట్లగాదు.. ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లెక్క ఖమ్మం జిల్లాలో కూడా పర్యటిస్త. త్వరలో ఆ పర్యటనకు కూడా పెట్టుకుందాం అని హామీ ఇచ్చారు.

ఆ తప్పు తుమ్మలదే
తుమ్మల పార్టీలో చేరుతున్నారంటే ఇంత మంది వస్తారని ఊహించలేదని కేసీఆర్ అన్నారు. వాస్తవానికి ఈ సభ నిజాం కాలేజీ మైదానంలో పెట్టాల్సిందని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలోనే చేరుతామని చెప్పినందుకే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెబుతూ ఆ తప్పు తుమ్మలదేనని చమత్కరించారు. కార్యాలయంలోపల ఎంత మంది ఉన్నారో బయట అంతకు పదింతలు ఉన్నారని చెప్పారు. వారందరికీ కూడా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *