ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో రంధ్రాన్వేషణ చేయకుండా ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తేవాలని, లోపాలు వెతకడం మాని నిర్మాణాత్మకమైన సూచనలు చేయండని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రతిపక్షాల నుద్దేశించి ప్రసంగించారు. గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిని కూడా ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయానికి అనుకూలంగా చేయాలని, వారికి కూడా బోరు వేయించి సంవత్సరం పాటు ఖర్చులు భరించాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి చేసిన సూచనను సీఎం అభినందించారు. గత ప్రభుత్వాలైనా సదుద్దేశంతో ఇచ్చిన భూమి నిరుపయోగంగా ఉండొద్దని, ఒకవేళ అటువంటివి తమ నియోజకవర్గాల్లో ఉంటే సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకురండని కేసీఆర్ సూచించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఖచ్చితంగా కట్టించి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. గతంలో చాలా అవకతవకలు జరిగిన విషయాన్ని సీఐడీ బయట పెట్టిందని, ఎవరైతే అక్రమంగా బిల్లులు ఎత్తుకుని తిన్నారో వారినుండి కక్కించి పెండింగ్ ఇళ్ళను పూర్తి చేస్తామని, ఇందులో ఎంత పెద్దమనుషులైనా వదలమని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు బాగానే ఉన్నాయని, వారికి అన్యాయం జరగొద్దనే ఎస్సీ వెల్ఫేర్ శాఖను తనతోనే ఉంచుకుని మానిటరింగ్ చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఉర్దూ విద్యాసంస్థల్లో త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామని, షాదీ ముబారక్ పై కొత్త గైడ్ లైన్స్ ఇస్తామని, ఆప్షనల్ లాంగ్వేజ్ గా ఉర్దూను సైతం ప్రవేశపెడతామని, అంతేకాకుండా రూ. 9.6 కోట్లతో నిజామియా యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
బీడీ కార్మికులందరికీ రూ. వెయ్యి జీవనభ్రుతి ఇస్తామని, రెండు, మూడు నెలల్లో అంగన్ వాడీలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తామని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. తల్లిదండ్రులను విస్మరించిన ఉద్యోగులు ఉంటే వారి జీతాల నుండి నెలకు వెయ్యి రూపాయలు కట్ చేసి తల్లిదండ్రులకు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సీజన్ లో ఒక్క నెలరోజులు కరెంట్ కష్టాలు ఉంటాయని, అదికూడా లేకుండా చేయడానికి వందశాతం ప్రయత్నం చేస్తున్నామని, 500 మెగావాట్ల విద్యుత్ ఇటీవలే కొన్నామని, దానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వస్తాయన్నారు. కేంద్రం నుండి మనకు కేటాయించిన గ్యాస్ అందుబాటులోకి వస్తుందని, దానివల్ల మూడు వందల మెగావాట్ల విద్యుత్ వస్తుందని, గాయత్రి పవర్ ప్రాజెక్టు నుండి కూడా కొంత వస్తుందని సీఎం స్పష్టం చేశారు.