రాజ్యసభలో పోలవరంపై చర్చ మొదలవ్వగానే ప్రశ్నోత్తరాలు చేపడదామన్న చైర్మన్ హమీద్ అన్సారీ వ్యాఖ్యలను తెలంగాణ ఎంపీలు వ్యతిరేకించారు. పోలవరం ఆర్డినెన్స్ పై చర్చ చేపట్టాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేస్తూ జై తెలంగాణ నినాదాలు చేయడంతో సభ మార్మోగిపోయింది. దీనితో సభ 15నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
మరోవైపు పోలవరం బిల్లును వెనక్కు తీసుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ, బీజేపీ నేతలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని, ముంపు ప్రాంతాలను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేతలు బిల్లును అడ్డుకోవాలని సూచించారు.
వాయిదా అనంతరం సభ ప్రారంభమవ్వగానే పోలవరం బిల్లును వ్యతిరేకించాలని, గిరిజనులను ముంచొద్దంటూ ఒరిస్సా, తెలంగాణ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పోలవరం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్వాసితులకు సహాయ, పునరావాసం కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని, భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతరం బిల్లును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తీర్మానాన్ని చేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, పోలవరం బిల్లు, స్టాట్యూటరీ మోషన్ పై వేరువేరుగా చర్చ జరగాలని, బిల్లుపైనా, మోషన్ పైనా ఓటింగ్ తీసుకోవాలని సూచించారు. పార్లమెంట్ లేని సమయంలో ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు.
పోలవరం బిల్లుకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ చెప్పగానే తెలంగాణ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల నష్టపోయే ఆదివాసీలకు న్యాయం చేయాలని, అభ్యంతరాలను పరిశీలించాలని ఛత్తీస్ గడ్ బీజేపీ ఎంపీ నందకుమార్ సాయి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేడీ ఎంపీ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, నష్టం వాటిల్లే రాష్ట్రాల సీఎంలతో కేంద్రం చర్చించాలని డిమాండ్ చేశారు.
పోలవరం డిజైన్ ను మార్చాలని సీపీఐ సభ్యుడు డీ. రాజా స్పష్టం చేశారు. పోలవరం విషయంలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించాలని, నిపుణులతో ప్రాజెక్టు రీ డిజైన్ చేయాలని, ముంపు మండలాల బదిలీ సమస్యలతో కూడుకున్నదని పేర్కొన్నారు. పోలవరం కట్టి రాజమండ్రి నగరాన్ని ముంచుతారా? అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ హోంమంత్రిని ప్రశ్నించారు. పోలవరాన్ని పక్క రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కేంద్రం తెలుసుకోవాలని, పోలవరం వల్ల భద్రాచలం కూడా ముంపుకు గురవుతుందని, నాలుగు లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులవుతారని చెప్పారు.
పోలవరం బిల్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందని సీపీఎం ఎంపీ రాజీవ్ అన్నారు. కేంద్రం చట్టవిరుద్ధంగా బిల్లును తీసుకువచ్చిందని, పోలవరం బిల్లును రాష్ట్రపతికి పంపాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని, ఖమ్మం జిల్లా ప్రత్యక్షంగా ప్రభావితం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి స్పష్టం చేశారు.
పోలవరం వల్ల మల్కన్ గిరి జిల్లాపై తీవ్ర ప్రభావం పడుతుందని, గిరిజనుల హక్కులు పట్టించుకోరా? ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అని ఒడిశా బీజేడీ ఎంపీ భూపేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల అనుమతి లేకుండా వారి భూములను ప్రాజెక్టుకు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కేకే మాట్లాడుతూ, పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని, లక్షలమంది గిరిజనులను ముంచేందుకు తాము వ్యతిరేకమని అన్నారు.