తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు రాజస్థాన్ అధికార బృందం. రాజస్థాన్‌లోనూ స్త్రీనిధి తరహా పథకాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్త్రీనిధిపై అధ్యయనానికి రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి కృష్ణకాంత్ పాఠక్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సోమవారం హైదరాబాద్‌లో స్త్రీనిధి కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి రాజస్థాన్ బృందానికి సంస్థ లక్ష్యాలు, రుణాల అందజేత తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రాజస్థాన్ అధికారులు రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో పర్యటించి స్త్రీనిధి గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణకాంత్ పాఠక్ మాట్లాడుతూ తెలంగాణలో స్త్రీనిధి సంస్థ పనితీరు బాగుందని ప్రశంసించారు. తక్కువ వడ్డీకి అతి తక్కువ సమయంలో రుణాలు ఇస్తున్నదని తెలిపారు. స్త్రీనిధి తరహాలో రాజస్థాన్‌లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమకు సహకారం అందించడానికి స్త్రీనిధి ముందుకొచ్చిందని వెల్లడించారు. రాజస్థాన్ బృందంలో రాజీవికా సంస్థ పీడీ హర్దిప్ సింగ్ చోప్రా, నాబార్డు అధికారి ఆర్‌ఎస్ జోధా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం మిషన్ మేనేజర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.