mt_logo

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు – కేటీఆర్

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యుత్ సమస్యలతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు భూమిపూజ చేసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని, ఎంత ధరైనా చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వాల అసమర్ధత వల్లే విద్యుత్ కష్టాలు వచ్చాయని, వచ్చే సంవత్సరం జూన్, జూలై కల్లా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

రైతులకు సమస్యలు వస్తే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కలవాలని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రుణమాఫీ కోసం తొలివిడతగా రూ. 4250 కోట్లు బ్యాంకులకు చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు, ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరముందని, తుఫానువల్ల ఉత్తరాంధ్రలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 18 కోట్ల సాయాన్ని అందించిందన్నారు. మానవతా దృక్పథంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *