mt_logo

ఎంత తెచ్చినా చాలట్లే

-గతం కంటే గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం
-వర్షాభావం, హుదూద్ ప్రభావంతో మరింత పెరిగిన కష్టాలు
-పంటలు కాపాడేందుకు సర్కారు ప్రత్యేక కృషి..
-20 మి.యూ. అదనంగా సరఫరా

గత ఏడాది ఇదే సమయానికి
డిమాండ్ : రోజుకు 126 మిలియన్ యూనిట్లు
సరఫరా : రోజుకు 122.35 మిలియన్ యూనిట్లు

ఈ ఏడాది తుఫాన్‌కు ముందు వరకూ
డిమాండ్ : రోజుకు 165 మిలియన్ యూనిట్లు
సరఫరా : రోజుకు 143 మిలియన్ యూనిట్లు

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టినా.. అధిక ధరలకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావటంలేదు. వాటికితోడు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటం, ఆపై తాజాగా హుదూద్ తుఫాన్ ప్రభావం రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థను అల్లకల్లోలం చేశాయి. ఇంతటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో గత ఏడాది కంటే 14.98 శాతం అధిక విద్యుత్తు సరఫరా జరుగుతుండటం గమనార్హం. వాస్తవానికి గతేడాది లెక్కలతో పోల్చితే డిమాండ్‌తోపాటు సరఫరా కూడా పెరిగింది.

గత ఏడాది (2013)అక్టోబర్ 15వ తేదీ వరకు డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు ఉండగా, సగటున 122.35 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందించగలిగారు. కానీ ఈ సంవత్సరం (2014)లో 32.54శాతం వరకు విద్యుత్ డిమాండ్ పెరుగుదల నమోదైంది. హుదూద్ తుఫాన్‌కు ముందు తెలంగాణలో రోజుకు 165 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే 143 మిలియన్ యూనిట్ల వరకు సరఫరా జరిగింది. అంటే గతంకంటే ఎక్కువ విద్యుత్‌నే ప్రభుత్వం సరఫరా చేయగలిగింది.

డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం పలు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. గణాంకాలను బట్టి చూస్తే గత ఏడాది కంటే 14.98 శాతం అధికంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తుఫాన్ తర్వాత ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 172.56 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే 134.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. హుదూద్ తుఫాన్ వల్ల తెలంగాణకు రావాల్సిన 15.84 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం కరెంటు కష్టాలను పెంచింది. పలు చర్యలతో సరఫరా మెరుగుపర్చినా.. డిమాండ్ స్థాయిని అందుకోలేకపోవడంతో కోతలు అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

బుధవారం(15న) రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 173.62 మిలియన్ యూనిట్ల మేరకు ఉండగా, 137.89 మిలియన్ యూనిట్ల మేరకు సరఫరా జరిగింది. దీంతో 35.73 మిలియన్ యూనిట్ల వరకు లోడ్ రిలీఫ్(కరెంటు కోతలు) అమలుచేశారు. ఇతర రాష్ర్టాల నుంచి 30.01 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేయటమే కాకుండా సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీఎస్) నుంచి 1.77 మిలియన్ యూనిట్లను ఓవర్‌డ్రాయల్(కోటాకు మించి వినియోగం) చేశారు. గురువారం కోసం పవర్ ఎక్చేంజ్‌లో 24 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ఉన్నతాధికారులు గురువారం సాయం త్రం సమీక్ష నిర్వహించారు. హుదూద్ తుఫాన్ కారణంగా సింహాద్రి (ఎన్టీపీసీ)లో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడంవల్ల తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, దీంతో కొరత ఎక్కువైందని అధికారులు నిర్థారించారు. హుదూద్ తుఫాన్‌వల్ల తెలంగాణకు రావాల్సిన 15.84 మిలియన్ యూనిట్ల విద్యుత్ నిలిచిపోయింది. తుఫాన్ కారణంగా జైపూర్-గాజువాక పవర్ గ్రిడ్‌లైన్ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్తు పవర్ ఎక్స్చేంజ్‌కు రాకుండా పోయింది.

తుఫాన్ తర్వాత తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడటంతో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకున్నది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న సింహాద్రి 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ గురువారం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. మరో మూడు యూనిట్లు కూడా త్వరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. సింహాద్రి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లయితే తెలంగాణకు 20 నుంచి 25 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీంతో విద్యుత్ సరఫరా కొంత మెరుగవుతుంది. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు (800 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఇక్కడి వ్యవసాయరంగానికి మరింత వెసలుబాటు కలుగుతుంది.

పవర్ ఎక్స్చేంజ్ ద్వారా కొనుగోలు..
రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా కరెంటును సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకూ పవర్ ఎక్సేంజ్ నుంచి రూ.310 కోట్లు వెచ్చించి, 539.27 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశారు.

ఈసారి వర్షాలు పెద్దగా కురవకపోవడం, తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయరంగం అంతా బోరుబావులపై ఆధారపడి ఉండటంతో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. గత పక్షం రోజులుగా సగటున 164 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదు కాగా, విద్యుత్ సంస్థలు 141 మిలియన్ యూనిట్ల వరకు సరఫరా చేయగలుగుతున్నాయి.

వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరాకోసం ప్రభుత్వపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే పవర్ ఎక్స్చేంజ్ ద్వారా వీలైనంతమేరకు ఎక్కువ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ధర ఎక్కువైనా వెరువకుండా అధిక ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సాహసం చేస్తున్నది. ఈ సీజన్‌లో గరిష్ఠంగా యూనిట్‌కు రూ.8.50 వెచ్చించి కొనుగోలుచేశారు.

గురువారం(16న) యూనిట్ రూ.6.36 చొప్పున 2.157 మిలియన్ యూనిట్లు, శుక్రవారం(17వతేదీ) కోసం యూనిట్ రూ.6.84ల చొప్పున 2.93 మిలియన్ యూనిట్ల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. అంటే ఇప్పటి వరకు బహిరంగ మార్కెట్లో 135.77 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు సగటున రూ.7.94లు వెచ్చించడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్రంలో జెన్‌కో, సంప్రదాయేతర ఇంధన వనరులు, సెంట్రల్ జనరేటింగ్‌స్టేషన్ల(సీజీఎస్) వాటా మొత్తం కలిపి 120 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో 141 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా రికార్డేనని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు, వ్యాపార అవసరాలకు, గృహాలకు కోతలు విధించి వ్యవసాయరంగానికి కరెంటును సరఫరా చేస్తున్నామని పేర్కొంటున్నారు.

కోతలు కొనసాగింపు …
వ్యవసాయరంగానికి విద్యుత్ కేటాయించే లక్ష్యంతోనే పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు కరెంటు కోతలను అమలుచేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్‌లో నాలుగు గంటల పాటు, జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల పరిధిలో ఐదు గంటలు, నగరాలు, మున్సిపాలిటీల్లో ఆరు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలపాటు అధికారికంగా కరెంటు కోతలు అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రాత్రివేళ లైటింగ్ సదుపాయం కోసం విద్యుత్ సరఫరా చేశారు. మొత్తంగా బుధవారం(15న) వ్యవసాయరంగానికి 11.21 మిలియన్ యూనిట్లు, గృహ అవసరాలకు 11.46 మిలియన్ యూనిట్లు, పరిశ్రమలకు 13.06 మిలియన్ యూనిట్ల వరకు లోడ్‌రిలీఫ్ అమలు అయ్యింది.

ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు
– విద్యుత్‌లోటు దృష్ట్యా పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టింది.
– పెన్నా సిమెంట్స్, థర్మల్ పవర్‌టెక్, శ్రీ సిమెంట్స్ నుంచి రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2015 మే 29వ తేదీ నుంచి తెలంగాణకు విద్యుత్ అందుతుంది.
– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 500 మెగావాట్లకు సోలార్ బిడ్స్ నిర్వహించింది. 1,892 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకోసం 108 మంది ముందుకొచ్చారు. నవంబర్‌నుంచి సోలార్ ప్లాంట్ల స్థాపన ఏర్పాట్లు మొదలవుతాయి.
– తెలంగాణ రాష్ర్టానికి ఏడేండ్లపాటు రెండు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ఈనెల 10వ తేదీన టెండర్లు పిలిచింది.

– వివిధ స్థాయిల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు పది సంస్థలు ముందుకు వచ్చాయి. వాటితో ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. 2015 మే నుంచి ఈ సంస్థల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
– తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి నేటి వరకు పవర్ ఎక్స్చేంజ్ ద్వారా 539.27 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు రూ.310కోట్లు ఖర్చుచేసింది.
– కేంద్రం ఆగస్టు ఒకటినుంచి వచ్చే ఏడాది(2015) మార్చి 31వరకు వంద మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది.
– జీఎమ్మార్ నుంచి వంద మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది.
– స్వల్పకాలిక పద్ధతిపై వచ్చే ఏడాది నవంబర్ ఒకటి నుంచి 500 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయడానికి టెండర్లు పిలిచింది.

– ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్తును అందించేందుకు నిర్ణయించింది. తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిన ధరను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లిస్తుంది. కారిడార్ అందుబాటులోకి రాగానే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది.
– తెలంగాణ జెన్‌కో ద్వారా ఆరువేల మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి ప్లాంట్లను, ఎన్టీపీసీ ద్వారా నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. వీటి ద్వారా మరో రెండేండ్లలో దశలవారీగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.

Source: [నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *