వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ విద్యుత్ కు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా కొత్త పవర్ ప్రాజెక్టులు చేపట్టాలని, వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరారు.
విద్యుత్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు.విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాలికలను రూపొందించాలని, ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరతను తట్టుకోవడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విద్యుత్ పొందే అవకాశాలు పరిశీలించాలని అన్నారు. అవసరమైతే తానే స్వయంగా ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని, ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కూడా మిగులు విద్యుత్ ఉన్నందున అక్కడినుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సరైన సమయంలో వర్షాలు రాకపోవడమే విద్యుత్ కొరతకు కారణమని, మే నెలలో ఉండే వాతావరణం ఇప్పుడు కూడా ఉండడం వల్లే విద్యుత్ డిమాండ్ కు కారణమని అధికారులు సీఎం కు తెలుపగా, ఇప్పటికే రుతుపవనాల రాక ఆలస్యమైనందున అధికంగా కరెంటు కోతలు అమలు చేయడం తప్ప మీరు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా కొనుగోలు చేయాలని సీఎం స్పష్టం చేశారు.