mt_logo

రైతులకు ఎర్రజొన్న బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో ఆర్మూర్ మండలానికి చెందిన ఎర్రజొన్న రైతుల బకాయిల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్రజొన్న రైతుల రెక్కల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అందుకే బకాయిలు చెల్లిస్తున్నామని, ఆర్మూర్ కు చెందిన రైతులు ఆరేండ్లుగా ఎర్రజొన్న బకాయిలకోసం పోరాటాలు చేశారని, గత పాలకులు ఎర్రజొన్న బకాయిలు చెల్లించడంతో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ సభలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఆర్మూర్ కు వచ్చిన సందర్భంలో ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారని చెప్పారు.

రాష్ట్రంలో 39లక్షల మంది రైతులకు 17, 900 కోట్లు రుణమాఫీ చేయనున్నట్లు, ఈనెల చివరిలోపు లక్షలోపు పంటరుణాలను ఖచ్చితంగా మాఫీ చేస్తామనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని, రుణ మాఫీ అయిన వెంటనే బ్యాంకుల్లో మళ్ళీ రైతులకు కొత్తగా పంట రుణాలు ఇచ్చేటట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి పోచారం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే పంట నష్టపరిహారం కింద 480 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, గతంలో వడగండ్ల వానకు పంటలు నష్టపోయామని, వాటికి నష్టపరిహారం కోసం గత ప్రభుత్వం వద్దకు వెళ్ళినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం వింతగా ఉందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *