భారతీయ రిజర్వు బ్యాంకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీపై మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. 2014 మార్చి 31వ తేదీలోపు రైతులు ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నా లక్షలోపు రుణాన్ని మాఫీ చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మూడు దశల ప్రక్రియ ద్వారా అర్హులైన రైతులను గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. మొదటి దశలో గ్రామస్థాయిలో బ్యాంకుల బ్రాంచ్ ల వారీగా రైతులు, వారు తీసుకున్న రుణాల వివరాలను సేకరిస్తారు. దీనిని మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సరి చూసుకుని గతేడాది పంట సంవత్సరంతో పాటు పాత రుణాలు, బంగారు తాకట్టు రుణాల వివరాలను సేకరించి మొత్తం కుటుంబానికి లక్ష రూపాయలకు మించితే కేవలం లక్షవరకే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది.
రెండవ దశలో అన్ని బ్యాంకుల బ్రాంచీల నుండి వచ్చిన పూర్తి సమాచారాన్ని జాయింట్ మండల కమిటీ సమీక్షించి ఈ వివరాలను రైతులు వేరే వాణిజ్య బ్యాంకుల నుండి, సహకార బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలతో పోల్చుతారు. ఎన్ని బ్యాంకుల నుండి తీసుకున్నా, ఎన్ని బ్రాంచుల నుండి తీసుకున్నా కేవలం లక్ష రూపాయల మేరకు రుణం తీసుకున్న కుటుంబంగా నిర్ణయిస్తారు.
మూడవ దశలో జిల్లా కలెక్టర్లు రుణమాఫీకి సంబంధించిన అంశాలను పరిశీలిస్తారు. ఒక్కొక్క మండలం వారీగా వివరాలను సేకరించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. మళ్ళీ పూర్తి వివరాలు సేకరించిన మీదట లక్షరూపాయల లోపు రుణమాఫీకి అర్హులైన వారి జాబితాను పంచాయితీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై ఉంచుతారు.
