mt_logo

సీఎం కేసీఆర్‌ను కలిసిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పరిశ్రమలకు ఒక్క సమావేశంతోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేసే సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసరమైన భూములను గుర్తించామని చెప్పారు. పరిశ్రమలకు ముందుగానే నీళ్ళు, రవాణా, రోడ్డు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామని, అవి పూర్తయ్యాకే భూముల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి అదానీ గ్రూప్ వంటి సంస్థలు ముందుకు రావాలని కోరారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, తమ సంస్థ 2020 లోగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తుందని, అలా ఉత్పత్తి చేసిన విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తామని, తెలంగాణలోనూ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరియల్ ఫినాన్, ఇండియా చీఫ్ టి. క్రిష్ణకుమార్ తదితరులు సీఎం కేసీఆర్ ను అదేరోజు కలిశారు. తెలంగాణలో దేశంలోకెల్లా అతిపెద్ద ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉందని ఇరియల్ ఫినాన్ పేర్కొన్నారు. 1000 కోట్లతో మెగా ప్రొడ్యూసింగ్ ప్లాంట్ నెలకొల్పుతామని, అలాగే సామాజికాభివ్రుద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని సీఎం కేసీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తామని, తమ ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *