mt_logo

రహదారులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్..

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణతో పాటు చెరువుల పునరుద్ధరణ పనులన్నీ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకల్లా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం, ఆర్అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులంతా జిల్లాల్లో పర్యటించాలని, తానుకూడా వచ్చేనెల నుండి హెలికాప్టర్ ద్వారా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానని చెప్పారు.

పంచాయితీ రాజ్ పరిధిలోని 38,500 కి.మీ. పొడవున రోడ్లను అభివృద్ధి చేయాలని, 14,500 కి.మీ. రహదారులకు మరమ్మతులు చేయాలని, 4,160 కిలోమీటర్ల మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని, 20,000 కి.మీ. మట్టిరోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రస్తుతం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిధులతో పాటు వచ్చే బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పనులు వేగంగా పూర్తి కావడంతో పాటు నాణ్యత విషయంలో కూడా అధికారులే పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.

కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ల నిర్మాణానికి రూ.1550 కోట్లు, నిజామాబాద్-డిచ్ పల్లి, ఖమ్మం-సూర్యాపేట రహదార్లను నాలుగు లైన్ల రోడ్లుగా మార్చడానికి రూ.440 కోట్లు, రాజీవ్ రహదారుల అభివృద్ధికి రూ. 750 కోట్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ. 50 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పోచారం, హరీష్ రావు, ఈటెల, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బాల్క సుమన్, జోగు రామన్న,  ఆర్అండ్ బీ రోడ్స్ చీఫ్ ఇంజినీర్ రవీందర్ రావు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *