– కోదాటి రామకృష్ణ
రాధాకృష్ణ తన కోస్తాబుద్ధి మానలేదు. తెలంగాణ నాయకులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, యూనివర్సిటీలకు లేని అవలక్షణాలను ఆపాదించి, మొత్తంగా ఉద్యమమే ఒక అవలక్షణంగా నిరూపించేందుకు ఎన్ని వంకరలు పోవాలో అన్ని వంకరలు పోతున్నాడు. ఏడ్వలేక నవ్వడం, కిందపడ్డా పైచేయి నాదే అనడం…., నాది ఒకటి పోతే పోయింది, వాడిది కూడా పోతుందని సంతోషించడం….ఇవన్నీ మరుగుజ్జులు, పిపీలికాల లక్షణం. ఆయన కేసీఆర్‌కు, టీఆరెస్‌కు వ్యతిరేకంగా నల్ల పందిని, ముళ్ల పందిని, తీటకొయ్యలాకును…దేనినయినా కౌగిలించుకునేట్టున్నాడు. ఆయన రాతలు చూస్తే రోత పుడుతుంది. విశ్లేషణ చూస్తే వికారం కలుగుతుంది.
1. ‘తెలంగాణలో అశాంతి ప్రబలకుండా చూడాల’ట.
తెలంగాణలో ఇప్పుడున్న అశాంతి తెలంగాణ రాకపోవడం వల్ల తలెత్తినది. తెలంగాణ వస్తే అశాంతి తలెత్తే అవకాశమే లేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణ ప్రజలు ఏరోజూ శాంతికి భంగం కలిగించే రీతిలో వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజలకున్న సంయమనం కూడా రాధాకృష్ణకు లేదు. తెలంగాణ ఇస్తే అశాంతి ప్రబలుతుందని ఈయన అనుకుంటున్నాడన్నమాట. తెలంగాణలో అశాంతి ఉంటే రాధాకృష్ణ ఇటువంటి కారుకూతలు, పిచ్చిరాతలు రాసేవాడు కాదు.
2. ఈ అష్టావక్రుడు ఇంకేమి రాశాడో చూడండి –
‘రెండు రోజుల క్రితం టీఆరెస్‌కు చెందిన కొంత మంది ప్రముఖులు ఢిల్లీకి వెళ్లినా కాంగ్రెస్ పెద్దలెవరూ వారితో మాట్లాడడానికి ఇష్టపడలేదట….కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో టీఆరెస్‌కు దిక్కుతోచడం లేదు…సోనియాగాంధీ ఆలోచన తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఔరా అని ఆశ్చర్యపోతుండగా, తమ పార్టీ పెద్దలు ఘనంగా ఆలోచిస్తున్నారని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారు’.
రెండు రోజుల క్రితం హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, వినోద్ ఢిల్లీ వెళ్లిన మాటవాస్తవం. తెలంగాణ కొరకు డిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాది రెడ్డి మృతి సందర్భంగా ఏపీ భవన్ లో జరిగిన సంఘటన కేసుకు సంబంధించిన తుది విచారణకు హాజరయ్యేందుకు వారు వెళ్లారు. కోర్టు విచారణ జరిపి కేసు కొట్టేసింది. వారు తిరిగొచ్చారు. వీరెవరూ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ వీరు ప్రయత్నించినట్టు, వారు తిరస్కరించినట్టు తన వంకరబుద్ధితో ఊహించి, రాసి వండి వార్చారు. కాంగ్రెస్ తీరుతో దిక్కుతోచనిది టీఆరెస్ కాదు. రాధాకృష్ణ, చంద్రబాబు అండ్ ఆయన ఏజెంట్లు. టీఆరెస్ విలీనం కోరకుండా తెలంగాణ ఇస్తే, తెలంగాణ ప్రజలకు అదనంగా మరో వరం ఇచ్చినట్టు. కాంగ్రెస్‌తో పోరాడే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని మిగిల్చినట్టు.
3. ‘కేంద్రం అసెంబ్లీలో తీర్మానం లేకుండా తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకుంద’ట… ‘ఈ పరిణామాన్ని ఊహించని కేసీఆర్ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అని తమలో తాము మథనపడిపోతున్నారు’. ‘సెంటిమెంటు కారణంగానే తెలంగాణ ప్రజలు ఆయనను గౌరవిస్తున్నారుకానీ ప్రజలలో ఆయనకు క్రెడిబిలిటీ లేదన్న అవగాహనకు కాంగ్రెస్ రావడం కూడా కేసీఆర్‌ను పక్కనపెట్టడానికి ఒక కారణంగా చెబుతున్నారు’.
పిచ్చోడి చేతిలో రాయి, ఉన్మాది చేతిలో పెన్ను ఒకటే. రాధాకృష్ణ సూత్రీకరణలకు ఏమైనా అర్థం ఉందా? కేసీఆర్ ఉద్యమం, పార్టీ మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్ర సాధనకోసం. అసెంబ్లీలో తీర్మానం లేకుండా తెలంగాణ వస్తే, తెలంగాణవాదులకు పండగ. కేసీఆర్‌కు పూర్తి స్వేచ్ఛ. ‘డామిట్ కథ అడ్డం తిరగడం కాదు….డ్యాష్ డ్యాష్…రాధాకృష్ణా…కాగలకార్యం గంధర్వులు తీర్చడం. తెలంగాణలో కేసీఆర్ క్రెడిబిలిటీ నీకంటే, చంద్రబాబుకంటే, గుండెలు తీసిన బంట్లు కాంగ్రెస్ నాయకులకంటే చాలా ఎక్కువ. ఏడిస్తే ఏడువు. నవ్వితే నవ్వు. కానీ ఏడ్వలేక నవ్వడం ఆపెయ్.
4. తెలంగాణ ఏర్పడాలంటే టీఆరెస్‌కు వంద అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాలు రావాలని కేసీఆర్ ఇప్పటిదాకా చెబుతూ వచ్చారని, ఇప్పుడు తెలంగాణ మేము ఏర్పాటు చేస్తే వందసీట్లు నీకెందుకు అని కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలే నిలదీస్తారని తెలంగాణ ప్రాంత మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. సెంటిమెంటును అడ్డంపెట్టుకుని ఇంతకాలం రెచ్చిపోయిన కేసీఆర్‌కు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపిస్తున్నారంటే ఎంతటి గుండెలు తీసినబంట్లో తెలుస్తున్నది.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాధాకృష్ణ నల్ల పందినయినా, ముళ్ల పందినయినా హాయిగా కౌగిలించుకుంటారని ఆయన రాతలు తెలియచేస్తున్నాయి. ఆయనకు రాజకీయ విభేదాలు లేవు. కాంగ్రెస్ ఇప్పుడు గుండెలుతీసిన బంటులాగా, ఔరా అనిపించే వ్యూహకర్తలాగా కనిపిస్తుంది. కాంగ్రెస్ వ్యూహం చూసి తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నాయకులు సంబరపడిపోతున్నారట. తెలంగాణకోసమే పన్నెండేళ్లుగా పోరాడుతున్న కేసీఆర్ తెలంగాణ వస్తుందంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. దివాలాకోరు విశ్లేషణ. దిక్కుమాలిన లాజిక్కు.
5. ‘తెలంగాణ ప్రజలకు కావలసింది తెలంగాణ మాత్రమే! కేసీఆర్ నాయకత్వంలో పునర్నిర్మాణం కాదు’…అని ఈయనే తీర్పు చెబుతాడు. తెలంగాణ ప్రజలకు కావలసింది తెలంగాణ మాత్రమేనా? సరిహద్దులు గీసుకుని తెలంగాణను రాధాకృష్ణలకు, చంద్రబాబులకు, వారి తొత్తులకు అప్పగిస్తే సరిపోతుందా? దీనికోసమేనా తెలంగాణ ప్రజలు కొట్లాడింది. మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా వనరులు మాకు దక్కాలని కొట్లాడిందంతా మరిచిపోవాలా? ఇప్పటిదాకా జరిగిన అన్యాయాలను సరిదిద్దవద్దా? ఇచ్చంపల్లి, శ్రీరాంసాగర్, ఎస్‌ఎల్‌బీసీ, కంతానపల్లి, కల్వకుర్తి, భీమా, జూరాల-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు పూర్తిచేసి కోటి ఎకరాలకు నీరివ్వొద్దా? కొత్త జిల్లాలు, సరికొత్త పాలనా సంస్కరణలు తేవద్దా? విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవద్దా? ఆధునిక తెలంగాణ నిర్మాణంకోసం ప్రణాళికలు రూపొందించవద్దా?
6. ‘తెలంగాణలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయ’ట. అవి ఏమిటంటే ‘విశ్వవిద్యాలయాలను మెరుగుపర్చడం. తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి’. ఇది దురహంకారం కూడా కాదు. బలుపు. కండకావరం. తెలంగాణ ఉద్యమం మీద ద్వేషంతో, ఆక్రోశంతో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడి విశ్వవిద్యాలయాలు, విద్యార్థులను అవమానించడం. ఇన్ని ఉద్యమాలు జరిగినా ఈరోజుకి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో తొలి పదిర్యాంకుల్లో ఉంది. జేఎన్‌టీయూ కళ తప్పలేదు. ఉస్మానియా, గాంధీ వైద్యకళాశాలల వాసి, వన్నె తగ్గలేదు. విద్యా ప్రమాణాలలో ఏరోజూ వెనుకబడలేదు. ఏ ఉద్యమాలు లేని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ ర్యాంకులో ఉంది రాధాకృష్ణా? ఎందుకింత వంకరబుద్ధి?
7. రాధాకృష్ణ ఇంకా ఏం చెప్పారంటే, ‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా పలు జేయేసీలు ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి కూడా అవి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగానే ఉద్యోగులలో జవాబుదారీతనం లోపించింది. తెలంగాణలో ఇది మరింత అధికంగా ఉంది’. ఇది కూడా ఇక్కడి ఉద్యోగులను, అధ్యాపకులను అవమానించే ఉద్దేశమే. ఉద్యోగులు ఉద్యమాలు చేసినమాట నిజం. కానీ ఏరోజూ విధులను నిర్లక్ష్యం చేయలేదు. బాధ్యత మరచి వ్యవహరించలేదు. ‘మా జోలికి వస్తే అధికారుల బట్టలూడదీసికొడ్తం’ అని ఏపీఎన్జీవో నేత గోపాలరెడ్డిలాగా ఏరోజూ టీఎన్జీవో నాయకులు మాట్లాడలేదు. సమ్మె చేసిన సందర్భాల్లో తప్ప హైదరాబాద్ మహానగర పారిశుధ్య కార్మికులు ఏనాడూ కసువు ఎత్తిపోయకుండా విశ్రమించలేదు. ఉద్యోగులకు ఈయన బాధ్యత నేర్పుతాడట. ఉద్యోగులకేనా బాధ్యత. మీడియాకు ఉండొద్దా? ఎవడో గొట్టంగాడు ఒక గొట్టం చానెల్, ఒక తొట్టి పత్రిక పెట్టుకుని ఎవరికీ బాధ్యత వహించకుండా దేశం మీద ఆంబోతులాగా చెలరేగిపోవచ్చు. ఏసుక్రీస్తులాగా నీతులు చెప్పవచ్చు.