mt_logo

రాష్ట్ర మొచ్చే దాకా రాజీలేని పోరు: కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేదాకా కేంద్రంపై మరింత వత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్ ఫ్రొపెసర్ కోదండరాం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఎవరికైనా సందేహాలుంటే సర్దుబాటు చేసి విడిపోయి కలిసి ఉండే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తుంచుకోవాలన్నారు. గురువారం నాచారం ఏఎన్‌ఆర్ గార్డెన్‌లో గ్రేట ర్ టీజేఏసీ ఆధ్వర్యంలో ‘సాగదీస్తే- సాగనంపుతాం’ నినాదంతో తలపెట్టిన మహా ధర్నా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ టీజేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కదిలిందన్నారు. అయితే కాంగ్రెస్ నిర్ణయం అనుకూలంగా వస్తుదనే నమ్మకం కలగడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలైట్లు పుట్టుకొస్తారంటూ సీఎం చెప్పడం సరైంది కాదని అన్నారు. సీమాంధ్ర నాయకులు తమ మాటలతో ఇరుప్రాన్తాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీ జేఏసీ కో చైర్మన్, గెజిటెడ్ అధికారులు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 25న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే కాలయాపన చేస్తుందన్నారు. గ్రేటర్ జేఏసీ కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ నెల 20న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ప్రెస్ మీట్, 21న జేఏసీ సమావేశాలు, 22న దీక్షలు, 23న ఇంటింటి ప్రచారం, 24న సైకిల్ మోటర్ల ర్యాలీలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ బేతి సుభాష్‌రెడ్డి, అంబర్‌పేట ఇన్‌చార్జీ ఎడ్ల సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు మీలపా చంద్రయ్య, న్యూడెమోక్రసీ నాయకురాలు అనురాధ, పాల్గొన్నారు.

నేటినుంచి టీ జేఏసీ జనచైతన్యయాత్రలు

హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేవరకు కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలనే ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం నుంచి తెలంగాణ జేఏసీ జనచైతన్య యాత్రలను ప్రారంభించనున్నది. ఉదయం 9 గంటలకు జేఏసీ కార్యాలయం నుంచి జేఏసీ చైర్మన్ కోదండరాం ఈ యాత్రను ప్రారంభించనున్నారు. రంగాడ్డి జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు జిల్లా బాధ్యులు సీ విఠల్ నాయకత్వం వహిస్తున్నారు. జేఏసీ నాయకులు వాహనాల్లో యాత్రగా బయలుదేరి ముందుగా వికారాబాద్‌లో విద్యార్థుల సదస్సు నిర్వహించి బహిరంగసభ జరుపుతారు. అక్కడి నుంచి తాండూర్‌లోని జిల్లా జేఏసీ నాయకుల సారథ్యంలో జనచైతన్య సదస్సును నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *