-ఆర్కే మార్క్.. మావోయిస్టు సంబడం
-సీఎం భద్రత వాహనానికి మావోయిస్టులకు లంకెనా?
-మరి బాబు కాన్వాయ్‌లో భద్రత దేనికి?
-మోదీ రాఫెల్స్ కొంటే యుద్ధం వచ్చేసినట్టా?
-ఆంధ్రజ్యోతిలో తెలంగాణ మీద విషం తప్ప విషయం ఉందా!
మెట్రో రైలు అయిపోయింది.. ఫార్మా కంపెనీల కర్ణాటక యాత్ర అయిపోయింది.. ఆంధ్రాకు కంపెనీలను వలసబాట పట్టించడం అయిపోయింది.. హైదరాబాద్ అధికారాలు గవర్నర్ చేతికి అప్పగించడం అయిపోయింది.. కరెంటు కోతలతో రాష్ట్రం విలవిలలాడడం అయిపోయింది.. బయ్యారం ఖనిజాన్ని విశాఖకు తరలించడం అయిపోయింది.. వసూళ్లు తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఢామ్మని పడిపోవడం అయిపోయింది.. ఇపుడు రాధాకృష్ణ కంటున్న కొత్త కల.. మావోయిస్టులు! పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఈ ఆంధ్రుడు కోరుకుంటున్నది ఇక్కడి పల్లెలు మళ్లీ యుద్ధభూములు కావాలని.. నెత్తుటేరులు పారాలని.. కలలు కనండి.. కలలు కనండి.. అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏ ముహూర్తాన చెప్పారో గానీ ఆ మాటలను రాధాకృష్ణ అక్షరాలా పాటిస్తున్నాడు.
ఎటొచ్చీ కల అంటేనే లాజిక్ లేని భ్రమ. కలలు కన్నవారెవ్వరూ సరిగ్గా అలా జరుగుతుందని అనుకోరు. కానీ రాధాకృష్ణ తన కలలను పేపర్లో అచ్చొత్తుతాడు. టీవీల్లో అలాంటి కథనాలను దేశం మీదికి వదుల్తాడు. ఈ భూమ్మీద ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదం.. ఆధారం. అందుకే ఆయన రాసే ఏ కథనానికీ ఆధారం ఉండదు. లాజిక్ అసలే ఉండదు. ఎదుటివాడు నవ్వుతాడన్న జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎవరన్నా ఏమని అంటారు.. ఏమని విసుక్కుంటారు.. ఎవడ్రా నీకు చదువు చెప్పిందీ? అని. అలా అనాల్సి వస్తే రాధాకృష్ణ ఇప్పటికే ఆ విషయంలో అనేక సెంచరీలు చేసినట్టు లెఖ్ఖ.
ఇక విషయానికి వస్తే రాధాకృష్ణకు మళ్లీ కల వచ్చింది. తెలంగాణ ప్రశాంతంగా ఎందుకు ఉంది.. అని ఈ మధ్య బాగా బెంగ పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఎన్నో విషయాల్లో నిప్పు రాజేయడానికి ఎంత ప్రయత్నించినా సర్క్యులేషన్ వెనక్కి పోవడం తప్ప ఫలితం వచ్చినట్టు లేదు. బాధాతప్త హృదయంతో అలసిసొలసి పడుకుని ఈసారి కొత్త సబ్జెక్ట్‌తో వెరైటీ కలగన్నాడు. ఎప్పుడో వైఎస్ హయాంలో గోదావరి దాటేసి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయిన మావోయిస్టులు మళ్లా బిలబిలమంటూ వచ్చేసినట్టు.. ప్రళయభీకర దాడులకు సన్నాహాలు చేస్తున్నట్టు.. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గడగడలాడుతున్నట్టు.. పెద్ద పెద్ద వాళ్లే టార్గెట్ అయినట్టు.. ఇలా చాలా కమ్మటి కల కన్నాడు. సీఎం కాన్వాయ్‌లో చేరిన ఓ కొత్త వాహనం సాకు దొరికింది. రెండింటికీ ముడిపెట్టి ఓ ముష్టికథ రాసేసి దేశం మీదికి వదిలాడు.
సదరు కథనంలో ఆయన తపన..కసి.. ఏ స్థాయిలో ఉందంటే.. మావోయిస్టులు రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రముఖుల పైన దాడి చేసే స్థాయిలో బలం పెంచుకుంటున్నారుట. బాగా దూరంనుంచి కూడా లక్ష్యాన్ని దెబ్బతీసే సామర్థ్యాన్ని(దగ్గరినుంచి వీలుకాకపోతే దూరంనుంచి.. మొత్తానికి దాడులైతే ఖాయం.. రాధాకృష్ణది గ్యారెంటీ) సమకూర్చుకుంటున్నారుట.. సరే.. నిఘావర్గాలకు అందకుండా అడుగులు వేస్తున్నారని, అనేక మంది కొత్త నాయకులు పదవీబాధ్యతలు కూడా స్వీకరించారని, ఇంత జరుగుతున్నా తెలంగాణకు కమిటీలో ఎవరెవరున్నారనేది పోలీసులకే తెలియడం లేదని ఇలా మసాలా అంతా వడ్డించారు. నిఘా వర్గాలకు సమాచారం ఉంటే మాత్రం రాధాకృష్ణకు చెబుతారా? అనే విషయం వదిలేస్తే తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని అంటూ దానికి కారణాలుగా తానే కొన్ని సంఘటనలను తనకుతానుగా రుద్దేశారు. ఆఖరికి ముక్తాయింపు ఏమిటంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల్లాగే ఉన్నదని అందువల్ల ఈ ప్రభుత్వంతో కూడా సమరం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారని జడ్జిమెంటు ఇచ్చేసుకున్నారు.
ఇక్కడ మిస్సయిన లాజిక్ ఏమిటంటే.. ఇటీవలే మావోయిస్టు ప్లీనరీ జరిగింది. అందులో తీర్మానాలు అన్ని పత్రికా కార్యాలయాలకు పంపించారు. తీర్మానాల్లో సహజంగానే మితవాద పార్లమెంటరీ ప్రభుత్వాల చర్యల మీద ఉండే విమర్శలే తప్ప యుద్ధ సంకేతాలుగానీ, లేదా ఆ స్థాయి విమర్శలు కానీ లేవు. వాస్తవానికి తెలంగాణ ప్రజలు దశాబ్దాల పోరాటం తర్వాత ఇటీవలే స్వరాష్ట్రం సాధించుకున్నారు. వచ్చిన రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు ఇపుడిపుడే ప్రారంభమైంది. ఇంకా అనేక పథకాలకు కార్యరూపం ఇచ్చేపని జరుగుతున్నది.
ఇవి ఫలించి ప్రజలకు పూర్తి స్థాయి అనుభవంలోకి రావడానికి సహజంగానే సమయం తీసుకుంటుంది. పార్లమెంటరీ పంథా ప్రభుత్వానికి ఉండే పరిమితులు, వనరులు, అవకాశాలు, బ్యూరోక్రసీలో ఉండే జాప్యం ఇతర సమస్యలు అధిగమించే దిశగా ఆ మేరకు మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల్లో ప్రభుత్వం మీద ప్రేమాభిమానాలు తాజాగానే ఉన్నాయి. ప్రభుత్వం మీద వారిలో అనేక ఆశలు కూడా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు మీద అనేక ఆకాంక్షలు ఉన్నాయి. మొగ్గ స్థాయిలో ఉన్న తెలంగాణకు.. యుద్ధం అనే పరిపక్వదశకు ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడా అన్వయమే లేదు. రాధాకృష్ణ లాంటి కురుచబుద్ధులకు ఈ లోతు అర్థం కాదు.
ఇకపోతే అత్యంత హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే.. సీఎం కాన్వాయిలో ఏదో కొత్త వాహనం కొన్నారని. అది మావోయిస్టుల భయం వల్లనేనని చెప్పడం. అసలు రక్షణ చర్యలు ఇవాళ కొత్తగా వచ్చిపడ్డవేమీ కాదు. దాదాపు ఏ రాష్ట్రంలో అయినా ఎవరు సీఎం అయినా వారి భద్రత పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. సీఎంకు రక్షణ కల్పించడమే ఆ వ్యవస్థ బాధ్యత. కాలానుగుణంగా వస్తున్న అధునికతను భద్రతకు జోడించడం ఒక రొటీన్ ప్రక్రియ. ఒకనాడు సీఎంల చుట్టు లాఠీలతో నెక్కర్లు వేసుకున్న పోలీసులు ఉండేవారు. తర్వాత 303 రైఫిల్స్, ఆ తర్వాత మిషన్‌గన్ ఇలా భద్రత పెరుగుతూనే వస్తున్నది. దేశ విదేశాల్లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం తీరుతెన్నులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి.
సీఎం చంద్రబాబు కూడా మైన్‌ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, తదితర టెక్నాలజీ ఉన్న కాన్వాయ్‌ను ఏర్పాటుచేసుకున్నారు. పదిమంది కమెండోలు ఉంటే తప్ప కాలు కదపరు. తాజా వాహనం విషయానికి వస్తే స్కార్పియోల స్థానంలో ఫార్చూనర్స్ వచ్చాయి. వాటికి తగ్గట్టుగా మైన్ అండ్ బుల్లెట్, ఫైర్ ఫ్రూట్ వాహనమైన రక్షప్లస్‌ను కాన్వాయ్‌లో ఏర్పాటుచేసినట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇక భద్రత, భయం అనే విషయాలనే పరిగణనలోకి తీసుకుంటే ఇవాళ ప్రజల్లోకి నేరుగా వెళుతున్న సీఎంలలో కేసీఆర్ అగ్రస్థానంలోనే ఉంటారు. ఆ మధ్య వరంగల్ పర్యటన, తర్వాత పాలమూరుతో పాటు శ్రీరామనవమి ఉత్సవాలను భద్రాచలం వెళ్లిన సీఎం దట్టమైన అడవుల గుండా గంటలకు గంటలు కారులోనే పర్యటించిన విషయం అందరికీ తెలుసు. హైదరాబాద్‌లో అనేక కాలనీల్లో పర్యటించిన విషయం ప్రజలతో చాలా సన్నిహితంగా మాట్లాడుతున్న విషయం కూడా తెలుసు.
అయినా సరే రాధాకృష్ణకు యుద్ధం కావాలి.. తెలంగాణ అల్లకల్లోలం కావాలి.. అందుకే రండి అని మావోయిస్టులను నేరుగా పిలవడం తప్ప మిగిలినదంతా రాసేశాడు. కానీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీ క్షీణదశలో ఉందని, ఆశించినంతగా రిక్రూట్‌మెంట్ జరగడం లేదని స్వయంగా మావోయిస్ట్ పార్టీ పెద్దలే ఇంటర్యూల్లో చెప్పుకున్నారు. విషయం అది కాగా మావోయిస్టులు మళ్లీ వచ్చేశారని, ఇక దినదిన గండమేనని రాధాకృష్ణ బట్టలు చింపుకోవడంలో ఆయన నేలబారు ఆలోచనలు మాత్రమే కనిపిస్తున్నాయి.
కొస మెరుపు:
విదేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌నుంచి 36 రాఫెల్స్ యుద్ధ విమానాల కొనుగోలుపై సంతకం చేశారు. ఇది రాధాకృష్ణ దృష్టికి వచ్చి ఉంటుందా? వస్తే అయిపోయింది పాకిస్థాన్‌తోనో.. చైనాతోనో యుద్ధం ఖాయం! అందుకే మోదీ రాఫెల్స్ విమానాలు కొనుగోలు చేశారు అని రాసేవాడు. ఏమో రాసినా రాస్తాడు..రాధాకృష్ణ కదా!
తెలంగాణలో మావోయిస్టుల ఉనికి ఏమిటి?
మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కమిటీ కింద మొత్తం 98 మంది కేడర్ ఉండగా తెలంగాణ వారు 24 మంది మాత్రమే. గతేడాది కొంత మంది విద్యార్థులను పార్టీలోకి తీసుకున్నా వారు ఆరునెలల్లో వెనక్కి వచ్చారు. ఆ కమిటీ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఖమ్మం జిల్లాకు 65 కిలోమీటర్ల దూరం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పాలిగూడెం, గుండ్రాజిగూడెం మధ్య తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ జరిగింది. ఇంతవరకు ఖమ్మం, ఆదిలాబాద్ కమిటీలు మాత్రమే వేయగా అవి ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నాయి. పోలీసులు చెప్తున్నదాని ప్రకారం మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు మొదలుకుని దండకారణ్య కమిటీ సభ్యులు, కేకేడబ్ల్యూ కమిటీ కీలక సభ్యులు, నేతలు ఇలా 68 మంది వివిధ హోదాల్లో ఉన్న మావోయిస్ట్‌లు గత ఏడాదిన్నర కాలంలో లొంగిపోయారు.
వీరిలో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, 3 జిల్లా కమిటీ సభ్యులు, ఒకరు సెంట్రల్ ఆర్గనైజర్, ఒకరు ఏరియా కమిటీ కార్యదర్శి, ఏరియా కమిటీ సభ్యులు-1, ఐదుగురు దళం సభ్యులు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం మావోయిస్ట్ సీనియర్ నేత గూడ్సా ఉసెండీ, ఆయన భార్య, అలాగే రవీందర్ అలియాస్ అర్జున్ అతడి భార్య పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మావోయిస్ట్ అలజడి లేదని, ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు కూడా తమకు లేవని, సాధారణంగా తమ నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..