రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను మంత్రులు ఈరోజు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలకేంద్రంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. హరీష్ రావు వెంట చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్కసుమన్ తదితరులు ఉన్నారు.
మరోవైపు జగిత్యాల మండలం నర్సింగాపూర్ లో మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పర్యటించి అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము జిల్లాలో పర్యటిస్తున్నామని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.