మొత్తం పది జిల్లాల్లో ఎన్ని చెరువులు సజీవంగా ఉన్నాయి? ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి? ఆయకట్టు ఎంత? అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తనకు సమగ్రంగా అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నీటిపారుదల శాఖపై సచివాలయంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో మొత్తం 36 వేల చెరువులు ఉన్నాయని, వాటికింద 20 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ విషయం పరిశీలించిన సీఎం కేసీఆర్ శుక్రవారం నుండి చెరువుల గణాంకాల వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించాలని, చిన్న నీటిపారుదల శాఖ సిబ్బంది మొత్తం క్షేత్రస్థాయికి వెళ్లి ఎన్ని చెరువులు ఉన్నాయి? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి? మరమ్మత్తు కోసం ఎలాంటి పనులు చేపట్టాలి? అనే వివరాలను ఈ నెల 21 వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.