నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో రెండువేల ఎకరాల విస్తీర్ణంలో భారీ సినిమా సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో సీఎం సోమవారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి సీఎంతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీఆర్ మీనా, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు.
హైదరాబాద్ కు కేవలం 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉన్నందున సినిమా నిర్మాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని భావించి స్థల పరిశీలన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. హాలీవుడ్ స్థాయిలో గ్లోబల్ టెక్నాలజీతో సినిమా సిటీ నిర్మిస్తామని, ప్రపంచం దృష్టిని ఆకర్షించే స్థాయిలో రెండువేల ఎకరాల్లో ఈ సినిమా నిర్మాణం ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి పెద్దపీట వేస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు. రాచకొండ గుట్టలకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, ఫిల్మ్ సిటీ వస్తే తమ ప్రాంత జాతకం మారిపోతుందని, గుట్టల్లో విచ్చలవిడిగా సాగుతున్న మైనింగ్ ను కూడా అరికట్ట వచ్చని అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.