మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయి వెళ్ళిన ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆదివారం ఫిక్కి, ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ-షోకేసింగ్ ఇన్వెస్ట్ మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ పొటెన్షియల్ సెక్టార్స్ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాము సెల్ఫ్ డిక్లరేషన్ తోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే వ్యవస్థను రూపొందించామని, దీని కోసం వెబ్ ఆధారిత ఈ-హెల్ప్ లైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు ఉంటాయని, రైట్ టు ఇన్ఫర్మేషన్ విధానాన్ని కూడా ఇందులో అమలు చేస్తున్నామన్నారు.
మా రాష్ట్రంలో వేధింపులకు ఆస్కారం లేని పారదర్శక, అవినీతిరహిత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి అక్కడి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ దుబాయి ఇన్వెస్టర్లను ఆకట్టుకుందని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కే ప్రదీప్ చంద్ర దుబాయి నుండి ఇక్కడి మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూసి కొందరు ఇన్వెస్టర్లు అప్పటికప్పుడు తాము టెక్స్ టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, జనరల్ ఇంజినీరింగ్, మినరల్ ఆధారిత పరిశ్రమలు, బయో టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెడతామని ప్రకటించారని చెప్పారు.
అనంతరం టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్ రంజన్ మాట్లాడుతూప్రభుత్వం రూపొందించిన సింగిల్ విండో, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం వంటివి ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు అధికారుల బృందం దుబాయిలోని స్మార్ట్ సిటీని సందర్శించి అక్కడి ప్లానింగ్ పై స్మార్ట్ సిటీ సీఈఓ అబ్దుల్ లతీఫ్ అల్ ముల్లాతో సమావేశమై అన్ని వివరాలు సేకరించారు.