హైదరాబాద్ లోని కుతుబ్‌షాహీ మెట్ల బావులకు యునెస్కో అవార్డ్ దక్కింది. యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ విభాగంలో ఈ అవార్డు ప్రకటించడం పట్ల దక్కన్ హెరిటేజ్ అకాడమి చైర్మన్ వేదకుమార్ మణికొండ తెలంగాణ ప్రభుత్వానికి, సాంస్కృతిక, వారసత్వ శాఖలతో పాటు ఆఘాఖాన్ ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక కాకతీయ, కుతుబ్‌షాహీ, ఆసిఫ్‌జాహీల కాలపు వారసత్వ సంపదకు తగిన గౌరవం దక్కిందని చెప్పారు. ఒకప్పుడు నీటి నిల్వ, తాగునీటి వనరులుగా వెలుగొందాయని గుర్తుచేశారు.
బావుల సంరక్షణ, పునరుద్ధరణ కోసం మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు అంతర్జాతీయ ప్రాముఖ్యత తీసుకురావడానికి దోహదపడిందని అన్నారు. గోల్కొండ కోట పరిరక్షణకు అధికారులు అవసరమైన అనుమతులు తీసుకొని కోటను సంరక్షించడం గొప్పవిషయమన్నారు. అవార్డు ఆఫ్ మెరిట్‌లో దోమకొండ సంస్థానానికి గుర్తింపు రావడంతో అనిల్ కామినేనికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ హెరిటేజ్ హోదాను పొందడానికి మార్గం సుగమమైందని మున్ముందు మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.