భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి సందర్భంగా.. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తోపాటు, మంత్రులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ పేర్కొన్నారు. దేశంలో పీవీ ఎన్నో సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని చెప్పారు.
పీవీ నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి పీవీ. కానీ కేంద్రం తెలుగువారిని పట్టించుకోవడం లేదు. తెలుగువారంటే కేంద్రంలో గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించందని మంత్రి తలసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవీతో పాటు పీవీ కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు నివాళులర్పించారు.