mt_logo

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి వేడుకలు

నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ లో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రొ. జయశంకర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీని ఆచార్య జయశంకర్ యూనివర్సిటీగా రాష్ట్రప్రభుత్వం పేరు మార్చిన విషయం తెలిసిందే.

యూనివర్సిటీలో 9 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రీసెర్చ్ కాంప్లెక్స్ ఎగ్జామినేషన్ హాల్ కు సీఎం శంకుస్థాపన చేశారు. క్యాంపస్ లో మహిళా వసతి గృహంలో ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన అనంతరం ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన అనంతరం మన ఊరు-మన కూరగాయలు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఇంటర్ విద్యార్ధి దశనుండి ఉద్యమాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలకు పైగా మడమ తిప్పని గొప్ప పోరాట యోధుడు జయశంకర్ సార్ అని, తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారని ప్రశంసించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కేంద్రానికి వినిపించిన వారిలో జయశంకర్ సార్ ఉన్నారని, అధికారికంగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు సార్ లేకపోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.

యూనివర్సిటీకి సార్ పేరు పెడితే ఆంధ్రోళ్లు కుళ్ళుకుంటున్నారని, అది మంచి పద్దతి కాదని, ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా పేర్లు మార్చేటివి చాలా ఉన్నాయని చెప్పారు. ‘మీ బతుకు మీరు బతకండి.. మా బతుకు మేం బతుకుతామని, కొట్లాడుదామంటే ఎందాకైనా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, పోరాటానికి తెలంగాణ భయపడదు. తెలంగాణ బతుకే ఒక పోరాటం అన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలను ఉద్దేశిస్తూ సీఎం అన్నారు.’ మీ పిల్లలు యూనివర్సిటీలో చదువుతామంటే 15శాతం సీట్లిస్తామని, మీ పిల్లల ఫీజులు మాత్రం మీరే కట్టుకోండని, ఆంధ్రాలో సింగపూర్ కడతారట కానీ పిల్లల ఫీజులు మాత్రం కట్టరట అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

గ్రీన్ హౌస్ కోసం సరఫరా చేస్తున్న విద్యుత్ కు కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారని, ఇకపై గ్రీన్ హౌస్ కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, తెలంగాణకు 110 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల అవసరం ఉందని, మనకు కేవలం 3నుండి 4 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే పండుతున్నాయని, కూరగాయలు పండించే విధంగా రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. సమైక్య పాలన కారణంగా విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, విద్యుత్ సమస్యను అధిగమించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నామని, దయచేసి రైతులు సంయమనం పాటించాలని, ప్రతిపక్షాలు ఇచ్చిన పిలుపులకు స్పందించి పాడుకావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *