ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ కేసు పూర్తిగా చంద్రబాబుకు వ్యక్తిగతమైందే తప్ప ఇందులో ఆ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం ప్రొ. కోదండరాం అధ్యక్షతన తెలంగాణ జేఏసీ కార్యాలయంలో టీజేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర వలసపాలకులు తమకు ఎదురైన ఇబ్బందులు ప్రజలపై రుద్దుతారని చెప్పడానికి ఏపీ ముఖ్యమంత్రి తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని, ఈ కేసులో జోక్యం చేసుకోవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు.
ఎన్నికల ద్వారా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రకారం సర్వహక్కులు ఉంటాయని, రెండు రాష్ట్రాల ప్రజల రాజ్యాంగ హక్కులకు పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ ను ఏపీ నేతలు విమర్శించడం మంచిది కాదని కోదండరాం స్పష్టం చేశారు. సెక్షన్-8 గురించి ఇప్పుడు ప్రస్తావించడం అర్ధరహితమని, ఏపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు మాటలు ప్రజాస్వామిక విలువలకు, స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈనెల 21 న తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్ధం రాష్ట్రమంతటా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించాలని కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, విద్యుత్తు ఉద్యోగసంఘాల జేఏసీ నేత రఘు, టీజీవో నేత సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.