mt_logo

ఇళ్ళు లేనివారికి ఇళ్ళు ఇస్తాం- సీఎం కేసీఆర్

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ పార్సీగుట్టలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ లో అందరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా మహిళలు పూనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, చెత్త సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. మంచి ఉద్దేశంతో చేసే పని ఏదైనా సరే తప్పకుండా విజయం సాధిస్తాం.. అందరం కలిసి ముందుకు పోదాం.. పట్టుబట్టాం.. పని మొదలుపెట్టాం.. సాధించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నగరంలో ఇళ్ళు లేని పేదలకు డబులు బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని, ఇక్కడి ప్రజల కోసం చిలకలగూడలోని రైల్వే స్థలాలను ఎకరం కోటి పెట్టి అయినా సరే కొని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని సీఎం స్పష్టం చేశారు. పార్సీగుట్ట, బౌద్ధ నగర్ లలో నాలాల విస్తరణలో ఇళ్ళు కోల్పోయిన వారికి, ఇక్కడ ఇళ్ళు లేనివారికి ఖాళీ జాగాలో ఇళ్ళు నిర్మిస్తామంటే కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం విమర్శించారు.

దేశ రాజధాని ఢిల్లీలో, మహారాష్ట్రలోని నాగపూర్ లో చెత్త నుండి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారని, ఢిల్లీలో అయితే ఇసుక, కంకర కూడా తయారు చేస్తున్నారని, ఢిల్లీ అన్నిటికంటే పెద్ద పట్టణం కాబట్టి ప్రజాప్రతినిధుల బృందం అక్కడికి వెళ్లి చూసి రావాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. మన కమిషనర్, నగర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ, నాగపూర్ లలో పర్యటించారు.. చెత్త ఎలా సేకరిస్తున్నారు? ఎన్ని రిక్షాలు ఉండాలి? ఎన్ని ఆటో రిక్షాలు ఉండాలి? వీటిని తీసుకుపోవడానికి ఎన్ని లారీలు ఉండాలి? వాళ్ళు ఎట్లా చేస్తున్నారనేది పరిశీలించిన అనంతరం హైదరాబాద్ చేరుకున్నారన్నారు. ప్రతినెల 17 వ తేదీన స్వచ్ఛ హైదరాబాద్ కు సంబంధించి సమావేశం అవుతామని, ఇన్చార్జిగా ఉన్న వాళ్ళు రావాలని సీఎం సూచించారు. ఈనెల 19న మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ పెట్టి నగరాన్ని పట్టిపీడిస్తున్న చెత్త సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *