ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జయశంకర్ సార్ అమర్ రహే నినాదాలతో తెలంగాణ భవన్ దద్ధరిల్లిపోయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం మన దురదృష్టమని, తుదిశ్వాస వరకు ఆయన తెలంగాణ కోసమే పోరాడారని తెలిపారు. ఆయన తనతో ఎప్పుడూ తెలంగాణ సాధన గురించే చర్చించేవారని, ఏది ఏమైనా తెలంగాణ రావాలి, ప్రజలు సుఖపడాలని చెప్పేవారని గుర్తుచేశారు.
రాష్ట్ర సాధన కోసమే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారని, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడారన్నారు. తెలంగాణ ప్రజలు ఇంకెన్నాళ్ళు వెనుకబాటుతనాన్ని భరించాలని బాధపడేవారని, తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా బతకాలని జయశంకర్ సార్ కోరుకున్నారని సీఎం చెప్పారు. ఉద్యమం సందర్భంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. అన్యాయం, దోపిడీ, అణచివేత ఎక్కడైతే మితిమీరుతదో, అక్కడ తిరుగుబాటు వస్తుందని అన్నారని గుర్తుచేశారు. మనకు తెలియని ఎన్నో విషయాలను జయశంకర్ తెలంగాణ సమాజానికి చెప్పారని, ఎన్నిసార్లు ఉద్యమాన్ని అణచివేసినా జయశంకర్ సార్ ఉద్యమాన్ని ఆపలేదని, సార్ చెప్పిన విషయాలు తనలో స్ఫూర్తి కలిగించాయని కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ప్రొ. జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, వరంగల్ లోని ఏకశిలా పార్కును ప్రొ. జయశంకర్ పార్క్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. నగరంలో అమరవీరుల మెమోరియల్ తో పాటు జయశంకర్ మెమోరియల్ ను ఏర్పాటు చేస్తామని, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు జయశంకర్ సార్ పేరును పెడతామని కేసీఆర్ చెప్పారు.
జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. జయశంకర్ సార్ గొప్ప దార్శనికుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా అయితే, తెలంగాణ సూరీడు జయశంకర్ సార్ అని మాజీ డీజీపీ పేర్వారం రాములు కీర్తించారు.