mt_logo

మన మహోపాధ్యాయుడు

-తెలంగాణ ఉద్యమంలో ఒడువని ముచ్చట..
-ఉద్యమకారుడి నుంచి.. మహోపాధ్యాయుడిదాకా..
-ప్రొఫెసర్ సాబ్ ఉద్యమ ప్రస్థానం.

మిస్టర్ జయశంకర్ ఇది హైదరాబాద్ స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ జీతభత్యాలు అంతే.. ఉద్యోగ నియామక పత్రంలో అంతకు ముందు చెప్పిన స్కేలు లేకపోవడంపై నిలదీసిన నూతన ఉద్యోగిపై ఆంధ్ర అధికారి చేసిన అవహేళన అది. ఎప్పుడో వరంగల్ మర్కజీ పాఠశాలలో విజయవాడ నుంచి వచ్చిన ఓ పంతులు తెలంగాణ భాష మీద, జీవన విధానం మీద వేసిన కుళ్లు జోకులకు వ్యతిరేకంగా గొంతెత్తిన విద్యార్థి యోధుడు, ఫజల్ కమిషన్ ముందు బిచ్చమెత్తి బతుకుతాం తప్ప వాళ్లతో కలవం అని కుండబద్దలు కొట్టిన నునూగు మీసాల వీర కిషోరం. ఉద్యోగ పాత్రలో జీవనపథంలో అడుగు పెడుతూనే ఎదుర్కొన్న సన్నివేశమది. జీవితమంతా ప్రతి మలుపులోనూ ఆంధ్ర దురహంకారాన్ని చవిచూసి ఎదిరించి తిరగబడ్డ ఆ యోధుడు తెలంగాణ సిద్ధాంత మహా మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ జయశంకర్.

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్టు 6న ఆయన జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. వరంగల్ మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య, న్యూ హైస్కూల్‌లో మాధ్యమిక విద్య, ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎస్‌సీ వరకు విద్యనభ్యసించారు.ఉస్మానియాలో బీఏ చేశారు. ఆర్ట్స్‌తో పాటు సైన్స్, సైన్స్‌తో పాటు ఆర్ట్స్ తప్పనిసరిగా చదవాలన్న నిబంధనలకనుగుణంగా ఆయా సబ్జెక్టుల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. బెనారస్ హిందూ వర్సిటీ, అలీగఢ్ వర్సిటీల నుంచి అర్థశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన జయశంకర్ తన అధ్యయన అనుక్రమణికను, ప్రణాళికలను ఆ చిన్న వయసులోనే రూపుదిద్దుకున్నారు. హన్మకొండలో బీఈడీ చేసి 1960లో ఉపాధ్యాయ వత్తిలోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పని చేశారు.

ఉద్యమ పథంలో …
1952 నాన్ ముల్కీ ఉద్యమంనుంచే ఆయన పోరాటం ప్రారంభమైంది. పోలీస్‌యాక్షన్ తర్వాత ఆంధ్రనుంచి ఉద్యోగులు భారీగా దిగుమతి అయ్యారు. వీళ్లంతా విశాలాంధ్రకావాలి అంటూ ప్రచారాలు ప్రారంభించారు. వరంగల్‌లో విశాలాంధ్రకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఆనాటి సభకు విజయవాడనుంచి అయ్యదేవర కాళేశ్వరరావు హాజరయ్యారు. ఆయన తన ప్రసంగంలో మీరు ఇలాగే ఉంటే అభివృద్ధి సాధించలేరు. విశాలాంధ్ర వస్తే మేము వచ్చి మీ అభివద్ధి చేస్తాం అంటూ ప్రారంభించి తెలంగాణ భాష, వేషభాషలు అన్నింటినీ కించపరిచే రీతిలో ప్రసంగించండం ప్రారంభించారు. ఆనాడు విద్యార్థిగా ఉన్న జయశంకర్ సహా అనేక మంది విద్యార్థులు తిరగబడి విశాలాంధ్ర గోబ్యాక్ నినాదాలు చేశారు. సభ రసాభాస కావడంతో పోలీసులు లాఠీచార్జీ జరిపారు. ఆ దెబ్బలు తిన్న వారిలో జయశంకర్ ఒకరు. ఈ సంఘటన స్ఫూర్తిగా హైదరాబాద్ సిటీ కాలేజీలో నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ, సాంబార్‌ గోబ్యాక్ ఉద్యమం ప్రారంభమైంది. పోలీసు కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మరణించారు. దీనికి నిరసనగా మరో ఆందోళనకు పిలుపునిచ్చారు విద్యార్థి నాయకులు. వరంగల్ విద్యార్థులంతా ఆనాడు బొగ్గుతో నడిచే ఓ బస్సు తీసుకుని హైదరాబాద్ వస్తుండగా భువనగిరిలో ఆది చెడిపోయింది.

దీనితో వారు హైదరాబాద్ చేరలేక పోయారు. ఆ రోజు మళ్లీ పోలీసుకాల్పులు జరిగి ఏడుగురు విద్యార్థులు కన్నుమూశారు. ఈ సంఘటనపై జయశంకర్ అనేకసార్లు ఆ రోజు నేను వెళ్లి ఉంటే కాల్పుల్లో చనిపోయేవాడిని తెలంగాణ దుర్గతి చూసే బాధ తప్పేది అని చెప్పేవారు. 1954లోనే విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు విద్యార్థి నాయకుడిగా ఆయన హాజరయ్యారు. ఫజల్ అలీ మేం చెప్పేదంత జాగ్రత్త విన్నడు. అన్నీ విన్నంక నవ్వుకుంట అడిగిండు. మీకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే బతకగలుగుతరా? అని అడిగిండు. మంచిగ బతకగలుగుతం. బతకలేకపోతే బిచ్చమెత్తుకుంటం. కానీ వాళ్ల దగ్గరికి మాత్రం పోం అన్నం అంటూ నాటి ఘటనను జయశంకర్ చెప్పేవారు. ఫజల్ నివేదికకు వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రలో కలిపేశారు. అయినా ఆయన పోరాటాన్ని ఆపలేదు. 1969 ఉద్యమంలోనూ ఉపాధ్యాయ హోదాలో భాగం పంచుకున్నారు.

విదేశాల్లో తెలంగాణ ఉద్యమం
తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ప్రొఫెసర్ సాబ్ పాత్ర మరవలేనిది. అమెరికాలో 1999లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరాన్ని స్థాపించడంలో, అమెరికాలోని సుప్రసిద్ధ నగరాల్లో విస్తృతంగా పర్యటించి, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలను కూడా ఉద్యమంలో మమేకం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. తెలంగాణ వెనుకబాటుతనాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లిన పిపాసి ఆయన. 2000లో అమెరికాలో జరిగిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సదస్సులో భాగంగా 10 ముఖ్య నగరాల్లో తెలంగాణ ఉద్యమం గూర్చి ప్రసంగాలు ఇచ్చారు. తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులుగా నియమితులై.. మరణించేంత వరకూ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కొనసాగారు.

డిసెంబర్ 9 ప్రకటన వెనుక..
కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో జయశంకర్ ఆయన వెంటే ఉన్నారు. కేంద్రం స్పందించి ముందుకు వచ్చినపుడు వారితో చర్చలు జరిపింది జయశంకర్ సారే. ఆయన ఆమోదించిన ప్రకటన పాఠాన్నే నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత ప్రకటన వెనక్కి పోయినా ఆయన అధైర్యపడలేదు. తెలంగాణ ఖాయమని ధృఢంగా విశ్వసించారు. తెలంగాణను తప్పక జూస్త. నాకైతే ఏం సందేహం లేదు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం మేజర్ ఎజెండా. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి మాడల్ ఎట్ల ఉంటదంటె అగ్రికల్చర్ లెవల్లో ఇరిగేషన్, రూరల్ డెవలప్‌మెంట్ అట్ల అన్నీ వస్తయ్. అన్నీ సాధ్యమైతయ్. అని ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ అనతికాలంలోనే క్యాన్సర్‌రూపంలో ఆయనను మృత్యువు కబళించింది. చివరిరోజుల్లో తనకెంతో ఇష్టమైన వరంగల్ పట్టణంలోనే ఉండిపోయారు. 76వ ఏట 2011 జూన్ 21న వరంగల్‌లో తన స్వగృహంలో కన్నుమూశారు.

తెలంగాణ భవన్‌లో నేడు వర్ధంతి సభ
-హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్‌సార్ మూడవ వర్థంతిని తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరవుతున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్‌లో ఉన్న జయశంకర్ విగ్రహానికి కేసీఆర్‌తో, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

-బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో..
జయశంకర్ మూడవ వర్థంతిని శనివారం సాయంత్రం 5.30 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణలో సుపరిపాలనకు అవకాశం అనే అంశంపై ఈ సమాశంలో చర్చ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమితాబ్‌పాండే హాజరవుతున్నారు. 1969 తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ గోపాలకిషన్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూడా హాజరవుతారని లక్ష్మయ్య తెలిపారు.ఓయూలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్‌కు నివాళులు అర్పించనున్నారు. మింట్ కంపౌండ్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు వర్థంతి కార్యక్రమం జరగనుంది. బొల్లారంలో ఉదయం 10గంటలకు జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో వర్థంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణ శ్వాసగా…
1968-69 లో జరిగిన జై తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుడిగా జయశంకర్ పోరాటం చేశారు. ఐదు దశాబ్దాల కాలంలో పదవులు, ప్రలోభాలు ముంగిట్లో వాలినా విసిరిపారేసి తెలంగాణ జెండాను ముద్దాడిన నిరుపమాన తెలంగాణ ఉక్కుమనిషాయన. అన్ని రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను సోదాహరణంగా లెక్కలతో సహా వివరిస్తున్నప్పుడు అర్థశాస్త్ర మహోపాధ్యాయులందరూ ఆయన ముందు చేతులు కట్టుకొని వినాల్సిందే. డిసిమల్ తేడాతో ఆయన చెప్పే గణాంకాలు ఢిల్లీ పాలకులను గడగడలాడించాయి. తెలంగాణ ఉద్యమానికి ఇంధనమయ్యాయి. ఫజల్అలీ కమిషన్‌కు నివేదికను రూపొందించిన నాటి నుండి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ తయారు చేసే వరకు ఆయన కలం తెలంగాణ కలంగా పని చేస్తూనే ఉన్నది. 1996 మలిదశ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటులో, ఆ తర్వాతి కాలంలో 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంలో ఆయన ముఖ్య భూమిక వహించారు. టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతకర్తగా నిలిచారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, ఒక ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ను మలచడంలో విరామమెరుగక పరిశ్రమించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *