ప్రొఫెసర్ జయశంకర్ సార్ 81వ జయంతి సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉదయం తెలంగాణ భవన్ కు చేరుకొని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి తదితరులు ఉన్నారు.
జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ కు విచ్చేసిన నిజామాబాద్ ఎంపీ కవిత పెద్దసార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధ్యం చేయడం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు నిజమైన నివాళి అని, సార్ బతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాకారంపై ఎంతో సంతోషపడేవారని అన్నారు. పదిమంది ఉన్నా, పది లక్షల మంది ఉన్నా ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ నినాదాన్ని అనునిత్యం కాపాడుకుంటూ వచ్చారని కవిత పేర్కొన్నారు.