ప్రైవేటు స్కూళ్ళలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ప్రణాళికా సఘం వైస్ ఛైర్మన్ బీ. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 21న ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 లో పేర్కొన్న నిబంధనలు పాటించాలని చెప్పారు. తెలంగాణ గుర్తింపు స్కూళ్ళ యాజమాన్యాల సంఘం(ట్రస్మా) ప్రతినిధులతో బుధవారం హైదారాబాద్ లోని వినోద్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాలు ప్రతినెలా టీచర్లకు జీతాలివ్వాలని, విద్యార్ధుల తల్లిదండ్రులు స్కూళ్లకు ఫీజులు చెల్లించి ప్రైవేటు టీచర్లను కాపాడుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.