mt_logo

రాజముద్ర పడింది..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఎంతో కీలకమైన రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మార్చి 1 నుండి చట్టంగా మారింది. 29 వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైంది. అయితే రాష్ట్ర ఆవిర్భావ తేదీ ప్రకటన మాత్రం గెజిట్ లో ప్రచురించలేదు. భారత ప్రభుత్వ కార్యదర్శి పేరిట విడుదలైన ఈ గెజిట్ లో డ్రాఫ్ట్ బిల్లులో ఉన్న లోపాలను సవరించి తెలంగాణ బిల్లుపై చేసిన కొన్ని సవరణలను చేర్చారు. ఇకపై రెండు రాష్ట్రాలకూ గెజిట్లో ఉన్నదే వర్తిస్తుంది. గెజిట్ లో పొందుపరిచిన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉండగా అందులో పోలవరం ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని 236 గ్రామాలు సీమాంధ్రలో కలిపారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లకు మించి ఉండరాదని, పదేళ్ళ తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా తెలంగాణ రాజధానిగా ఉంటుందని పొందుపరచారు. ఉమ్మడిరాజధాని ఉన్నంతకాలం ప్రజల భద్రత, ఆస్తుల పరిరక్షణ అధికారాలు గవర్నర్ చేతిలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి 17 ఎంపీ స్థానాలు ఉండగా రాజ్యసభ స్థానాలు మాత్రం ఇప్పటికి పెంచరు. తర్వాత రాష్ట్రానికి కేటాయించే సంఖ్యను బట్టి ఎంపీ స్థానాలు ఉంటాయి. శాసనసభకు తెలంగాణలో 119 స్థానాలను 153 స్థానాలకు పెంచుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. రెండురాష్ట్రాలూ ఇప్పుడున్న హైకోర్టులోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రపతి నిర్ణయిస్తారు. జడ్జీల నియామకం, హైకోర్టు పరిధి విషయంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం. ఉద్యోగుల పంపిణీ, నదీజలాల బోర్డుల నియామకం డ్రాఫ్ట్ బిల్లులో సూచించిన విధంగానే చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *