mt_logo

అన్నిట్లో తెలంగాణ రాజముద్ర

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ముద్ర పడనుంది. ఇప్పటికే వాహనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బదులుగా తెలంగాణ నంబర్ ప్లేట్లను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలలో తెలంగాణ రాజముద్ర ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఉండగా వచ్చే విద్యాసంవత్సరం నుండి దాని స్థానంలో తెలంగాణ రాజముద్ర ఉంటుంది. ఇప్పటికే 2014-15 విద్యాసంవత్సరం పాఠ్యపుస్తకాల సిలబస్ ప్రింట్ అయినందున వచ్చే విద్యాసంవత్సరంలోనే పుస్తకాల ముఖచిత్రం, సిలబస్ లో మార్పులు  అమల్లోకి రానున్నాయి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకే కాకుండా ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ, పీజీ పాఠ్యపుస్తకాల కవర్ పేజీ మారనున్నాయి. ఇప్పటివరకూ ఏ పుస్తకంలో చూసినా సీమాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు మేళవించేలా ఆంధ్రప్రదేశ్ భౌగోళికపటం ముద్రించేవారు. వాటి స్థానంలో తెలంగాణ మ్యాప్ తో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రింట్ చేయనున్నారు. పాఠ్యాంశాల్లో కూడా ముఖ్యంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా పుస్తకాల్లో తెలంగాణ వీరులు, ఉద్యమాలు, స్థానికంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు పొందుపరుస్తారు. 6వ తరగతి నుండి 10వ తరగతి పుస్తకాల్లో సీమాంధ్ర కవుల రచనలు 60 శాతం ఉండగా తెలంగాణ కవుల రచనలు 40 శాతం ఉన్నాయి. విభజన తర్వాత పూర్తిగా తెలంగాణ కవుల రచనలు చేరుస్తారు. సాంఘిక శాస్త్రంలో తెలంగాణ చరిత్ర, ఆచారవ్యవహారాలు, భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర ఆవిర్భావం తదితర అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా మా తెలుగు తల్లికీ మల్లెపూదండ గేయం స్థానంలో తెలంగాణ కవి అందెశ్రీ రచించిన జయహే తెలంగాణ గీతాన్ని ప్రచురిస్తారు. ఈ గీతాన్నే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *