-శ్రీగుణ గటిక
అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాన్ ఎఫ్ కెనెడి ఒక మాట అంటాడు. మొదటి వందరోజుల్లోనే అన్ని పనులు పూర్తికావు. మొదటి వెయ్యిరోజుల్లో కూడా అన్నీ పూర్తికావు. నా పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా అన్నీ పూర్తికావు. అంతెందుకు, ఈ భూగోళం మనుగడ సాగించినంతవరకు కూడా అన్నీ పూర్తికావు. అయినా సరే… మనం పని ప్రారంభించాలని కెనెడి చెపుతాడు.
మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగులు వేస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా ఈ ప్రయాణం సాగాలి. కెనెడి చెప్పినట్లు పని ప్రారంభం కావాలి. చిత్తశుద్ధితో దాన్ని ప్రారంభించాలి. మొదటి అడుగు తడబడితే నడకంతా తప్పుడు దారిలోనే వెళుతుంది. లక్ష్యానికి దూరంగా ఎంతదూరం నడిచినా ప్రయోజనం ఉండదు. అందుకే మొదటి అడుగు జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉన్నది. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖలపై మంత్రులు, ముఖ్య అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. సమీక్షలు చేస్తున్నారు. ఈ నెలరోజుల్లో కేసీఆర్ సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయించారు.
నెలరోజుల్లో ఒక్క పనీ ప్రారంభించలేదని విమర్శకులు చేసే వ్యాఖ్యలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే వ్యూహం లేకుండా హడావుడిగా ఉరికితే ఏం లాభం లేదన్నది కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన మాట. నాలుగు రోజులు ఆలస్యమైనా మంచిదే, సమగ్ర ప్రణాళికతో, ఆచరణయోగ్యమైన మార్గంలోనే పని ప్రారంభించాలని ఆయన అంటున్నారు. చర్చలు, సమాలోచనలు, వాదోపవాదాలు, సమీక్షలు జరిగిన తర్వాత వెలువడే నిర్ణయాలు పభుత్వం విజయవంతం కావడానికి, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడానికి కారణమవుతాయని పరిపాలనా శాస్త్ర నిపుణులు పలు సూత్రీకరణలు చేసి ఉన్నారు.
గతవారం జపాన్ కౌన్సిల్ జనరల్ తన ప్రతినిధి బృందంతో వచ్చి కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తాము పెట్టుబడులు పెట్టాలనకుంటున్నామని, వివిధ రంగాల్లో కలిసి పనిచేద్దామనుకుంటున్నామని చెప్పారు. కొన్ని విషయాలపై ప్రతిపాదనలు కూడా చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా, వెంటనే కార్యరంగలోకి దిగేవారు. అధికారులకు చెప్పి ఒప్పందాలు చేసుకోమనే వారు. కానీ కేసీఆర్ అలా చేయలేదు. మేం మా రాష్ట్ర అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిచుకుంటున్నాం. తుదిరూపం రావడానికి ఓ నెలరోజులు పడుతుంది. అప్పుడు మీతో మరోసారి చర్చిస్తాం. మనం ఏ రంగంలో కలిసి పనిచేయవచ్చో స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే మంచింది అని కేసీఆర్ వారికి చెప్పారు.
ఈ ఉదాహరణ చాలు, కేసీఆర్ సమగ్ర ప్రణాళిక, పక్కా వ్యూహం ప్రకారమే ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారని చెప్పడానికి. చాలామందికి గుర్తుండే వుంటుంది. కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రారంభించడానికి ముందు కూడా నెలల తరబడి ఇలాంటి చర్చలు, సమాలోచనలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో రోజుల తరబడి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ ఉద్యమాలపై అధ్యయనం చేశారు. రాజ్యాంగానికి లోబడి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమనే లక్ష్యాన్ని సాధించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్న తర్వాతే కార్యరంగంలోకి దిగారు. ఫలితం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ పాలనను కూడా ఓ ఉద్యమంలాగానే నడపాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు కేవలం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మాత్రమే సంబంధించిన అంశమనే అభిప్రాయం ఉంది. నిజానికి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం ఉండి, ఓ ఉద్యమంలా నడిస్తే తప్ప విజయవంతం కావు. అందుకే ప్రజలందరిని భాగస్వామ్యులను చేసి తెలంగాణ కోసం ఉద్యమం నడిపినట్లే, ఇప్పుడు ప్రజలందరినీ కలుపుకుని అభివృద్ధి కోసం ఉద్యమం చేయాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించారు. ఉద్యమం వేరు, ప్రభుత్వం వేరు. నిజమే. ప్రభుత్వానికి అనేక పరిమితులుంటాయి. పాలనలో మర్రి ఊడలు దిగినట్లే అనేక అవలక్షణాలు పాతుకుపోయి ఉంటాయి. వాటిని ఒక్క రోజులో తీసేయడం సులభం కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు. యథారాజ, తథాప్రజ కాబట్టి, రాజకీయ అవినీతిని అంతమొందించే విషయంలో ముఖ్యమంత్రి చొరవ, ఖచ్చితంగా అందరిలో ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు రాష్ట్రంలో సర్పంచ్‌లు మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీల దాకా అంతా కొత్తగా ఎన్నికయిన వారే. ఇంకా వారు కార్యాలయాల్లో సర్దుకోలేదు. వారు సీట్లలో సర్దుకునేలోపే అవినీతి కూపంలో దింపే యంత్రాంగాలు ఆయా కార్యాలయాల చుట్టూ చెక్కర్లు కొడుతున్నాయి. గ్రామ పంచాయితీ నుంచి సెక్రటేరియట్ వరకు ఈ పైరవీకారుల వలయం ప్రజాప్రతినిధులను లోబరచుకునేందుకు సిద్ధంగా ఉంది. పారంభదశే కాబట్టి, ప్రజాప్రతినిధులు ఇంకా మలినం కాలేదు. వారిని కాపాడుకోవడంపైనే రాజకీయ అవినీతిని రూపుమాపేది ఆధారపడి ఉన్నది. అందుకు రెండు మార్గాలు- ప్రజాప్రతినిధులు చెడిపోకుండా సమాజం అప్రమత్తంగా ఉండడం, ప్రభుత్వ పథకాలు ఎక్కడా అనినీతికి ఆస్కారం కల్పించే విధంగా ఉండకపోవడం. ఈ ద్విముఖ వ్యూహంతో అవినీతిని అంతమొందించాలనేది కేసీఆర్ ఆలోచన.
అల్పాదాయ వర్గాలకు మేలు చేయడానికి తెల్లరేషన్ కార్డులిస్తే, ధనవంతులు కూడా తప్పుడు ధృవీకరణలతో వాటిని దక్కించుకున్నారనేది వాస్తవం. బలహీన వర్గాల గృహ నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా వచ్చే రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు లాంటి పథకాలు కూడా అసలైన అర్హులకన్నా ధనవంతులు, పైరవీకార్లకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.
వీటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం. ఇప్పుడే ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టి ధృఢవైఖరి తీసుకోకుంటే, భవిష్యత్తులో పేదల కోసం మంచి పథకాలు తేవడం సాధ్యం కాదు. కేసీఆర్ అనుకున్నట్లు రాజకీయ అవినీతిని అంతం చేయడం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు కేసీఆర్ ఓ రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తాడా? బంగారు తెలంగాణ నిర్మాతగా పనిచేస్తాడా? మంచి నిర్ణయాలు తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని మారుద్దాం. తప్పుల్ని సరిదిద్దుదాం. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుందాం. ఎవరైనా ఇబ్బంది పడినా సరే, తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు. నాకు నా రాజకీయ భవిష్యత్తు గురించి రంది లేదు. తెలంగాణ భవిష్యత్ కోసమే పనిచేస్తా. మంచికోసం తీసుకున్న నిర్ణయాలు చిత్తశుద్ధితో అమలు చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వాటిని అందరూ ఆమోదిస్తారు అని కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు.
ప్రభుత్వ పాలన పారదర్శకంగా, ఓ ఉద్యమంలా సాగితే… అన్ని విషయాలు అందరికీ తెలిస్తే అనినీతిని తగ్గించవచ్చనేది కేసీఆర్ ఆలోచన. అందరికీ అన్ని విషయాలు తెలిస్తే, దొంగచాటు వ్యవహారాలకు తక్కువ అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు వివిధ రంగాలకు సంబంధించి సలహా మండళ్లను కూడా వేసే ఆలోచన ప్రభుత్వానికున్నది. ఇలా ప్రజలందరి భాగస్వామ్యంతో బాగుపడ్డ గంగదేవిపల్లి లాంటి తెలంగాణ పల్లెలు మన కళ్లముందే కనిపిస్తున్నయ్. మన ఊరు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం అనే భావన అందరిలో కనిపించాలనేది కేసీఆర్ నినాదం. అందుకే గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి వేర్వేరుగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పాలనలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నారు.
ఉద్యమ సందర్భంలో ఎలాంటి ఐక్యతను, చిత్తశుద్ధిని చాటారో.. మరోసారి తెలంగాణ సమాజం అంతటి చైతన్యం ప్రదర్శించాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. స్వరాష్ట్రం కోసం గ్రామస్థాయిలో ఉన్న ప్రత్యర్థులు కూడా చేతులు కలిపిండ్లు. ప్రాణత్యాగం చేసిన వీరులకు ప్రజలంతా ఒక్కటై జోహార్లు పలికిండ్లు. సకలజనుల సమ్మె సందర్భంగా ఎన్ని కష్టాలైనా అనుభవించిండ్లు తప్ప వెనక్కి పోలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, మా బతుకులు బాగుపడతయ్ అనుకున్నరు. ఇప్పుడు కూడా అంతటి చైతన్యం అవసరమని కేసీఆర్ అంటున్నరు.
ప్రజాచైతన్యంతోనే మార్పు సాధ్యమవుతుంది. మార్పు ప్రజా ఉద్యమం వల్లే సాధ్యమవుతుంది అని ప్రఖ్యాత ఇంగ్లీషు నవలా రచయిత ఆల్డస్ హాక్స్ లే అంటాడు. ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమస్ఫూర్తితో కదం తొక్కాల్సి ఉంది. మన రాష్ట్రంలో మన పాలన అనే నినాదానికి సరైన అర్థం రావాలంటే ప్రజలందరూ పరిపాలనలో భాగస్వాములు కావాలి. ఈ రాష్ట్రం నాది అనే పట్టింపు అందరిలో రావాలి. ప్రభుత్వం కూడా అవినీతి రహితంగా, పారదర్శకంగా పాలన అందిస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో చక్కగా తీర్చిదిద్దుకునే మహాయజ్జంలో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..